Toyota : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 543కి.మీ..రూ.25 వేలకే టయోటా తొలి ఎలక్ట్రిక్ ఈవీ బుకింగ్
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 543కి.మీ..రూ.25 వేలకే టయోటా తొలి ఎలక్ట్రిక్ ఈవీ బుకింగ్
Toyota : ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి భారీ అడుగు వేసింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను దేశీయంగా ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన ఈ కారులో టయోటా తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి ప్రీమియం లుక్‌ను ఇచ్చింది. ఈ కారు రేంజ్, ఫీచర్లు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో ఇది కొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని టయోటా కిర్లోస్కర్ మోటార్ తన సరికొత్త ఈవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను సిద్ధం చేసింది. ఈ కారును వచ్చే కొన్ని వారాల్లోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కారు సుమారు రూ.19 లక్షల నుంచి రూ.24 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా దీనిని E1, E2, E3 అనే మూడు వేరియంట్లలో కంపెనీ లాంచ్ చేస్తోంది.
ఈ కారులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని రేంజ్ గురించి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది సిటీల్లోనే కాకుండా దూర ప్రయాణాలకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే బేస్ వేరియంట్ E1లోనే అవసరమైన అన్ని రక్షణ, సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. మిడ్ వేరియంట్ E2లో వైర్‌లెస్ ఛార్జర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ లభిస్తాయి. ఇక టాప్ ఎండ్ వేరియంట్ E3లో పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి.
కలర్ ఆప్షన్స్ విషయంలో కూడా టయోటా ఎక్కడా తగ్గలేదు. మొత్తం 9 రంగుల్లో ఈ కారు లభిస్తుంది. అందులో 5 సింగిల్ టోన్ రంగులు ఉండగా, 4 డ్యూయల్ టోన్ ఆప్షన్లు ఉన్నాయి. కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగులతో పాటు స్పెషల్ ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ కలర్‌ను డ్యూయల్ టోన్‌లో మాత్రమే అందిస్తున్నారు. ఈ కలర్ ఆప్షన్లు కారుకు ఎంతో ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.
వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించేందుకు టయోటా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో కారును తిరిగి కంపెనీకే అమ్మాలనుకుంటే 60 శాతం బైబ్యాక్ అస్యూరెన్స్ కూడా ఇస్తోంది. అంటే మీ పాత ఈవీకి మంచి రీసేల్ వాల్యూ లభిస్తుందని కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా ఈవీ కొనుగోలును మరింత సరళం చేస్తోంది. ఈ ఫీచర్లు, ఆఫర్ల నేపథ్యంలో టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు టయోటా ఎబెల్లా గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.