Tata Nexon vs Kia Sonet : టాటా నెక్సాన్ vs కియా సోనెట్..మైలేజ్, పవర్, సేఫ్టీలో ఏది బెస్ట్?
టాటా నెక్సాన్ vs కియా సోనెట్..మైలేజ్, పవర్, సేఫ్టీలో ఏది బెస్ట్?
Tata Nexon vs Kia Sonet : భారతీయ రోడ్లపై కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న టాటా నెక్సాన్ ఒకవైపు.. స్టైలిష్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న కియా సోనెట్ మరోవైపు. మీరు కూడా ఈ రెండింటిలో ఏది కొనాలా అని తల పట్టుకుంటున్నారా? అయితే ఈ కంపారిజన్ మీ కోసమే. సేఫ్టీలో నెక్సాన్ తోపా? లేక ఫీచర్లలో సోనెట్ మొనగాడా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కాంపాక్ట్ ఎస్‌యూవీ అంటేనే ముందుగా గుర్తొచ్చేవి టాటా నెక్సాన్, కియా సోనెట్. ఈ రెండు కార్ల మధ్య పోటీ క్రికెట్ మ్యాచ్‌లా ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. మొదట డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. నెక్సాన్ కొంచెం వెడల్పుగా ఉండి రోడ్డుపై చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దీని ఇంటీరియర్ సింపుల్‌గా ఉన్నా చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. మరోవైపు కియా సోనెట్ చూడ్డానికి చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. సోనెట్ ఎత్తు నెక్సాన్ కంటే కొంచెం ఎక్కువ ఉండటం వల్ల లోపల కూర్చున్న వారికి హెడ్ రూమ్ కాస్త మెరుగ్గా ఉంటుంది. కానీ సీటు కంఫర్ట్ విషయంలో వెడల్పాటి సీట్లు ఉన్న నెక్సాన్ కే మార్కులు ఎక్కువ పడతాయి.
ఫీచర్లు, టెక్నాలజీ: ఫీచర్ల విషయంలో ఈ రెండు కార్లు ఒకదానికొకటి పోటీ పడతాయి. నెక్సాన్‌లో ఇప్పుడు సరికొత్తగా పనోరమిక్ సన్‌రూఫ్ వచ్చింది, ఇది కారు లోపల గాలి వెలుతురును అద్భుతంగా ఉంచుతుంది. కియా సోనెట్‌లో మాత్రం సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్ మాత్రమే ఉంటుంది. అయితే, సోనెట్‌లో 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది, ఇది లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. రెండు కార్లలోనూ 360-డిగ్రీ కెమెరాలు, వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. నెక్సాన్ లో గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ వల్ల లుక్ బాగున్నా, దానిపై వేలి ముద్రలు, దుమ్ము త్వరగా పడతాయి, సో జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంజిన్, పర్ఫార్మెన్స్: పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సోనెట్ వద్ద ఆప్షన్లు ఎక్కువ. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. నెక్సాన్ లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. అయితే నెక్సాన్ లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటం వల్ల మైలేజ్ కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్. ట్రాన్స్‌మిషన్ పరంగా సోనెట్‌లో ఇచ్చే 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ చాలా వేగంగా మారుతూ మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. నెక్సాన్ లో కూడా ఇప్పుడు 7-స్పీడ్ DCA గేర్‌బాక్స్ వస్తోంది, ఇది పాత మోడళ్ల కంటే చాలా మెరుగ్గా పనిచేస్తోంది.
సేఫ్టీలో నెక్సానే మొనగాడు: సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లోబల్ ఎన్‌సిఎపి, భారత్ ఎన్‌సిఎపి నుంచి నెక్సాన్ 5-స్టార్ రేటింగ్ సాధించి భారత్‌లో అత్యంత సురక్షితమైన కారుగా పేరు తెచ్చుకుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ వంటి ఫీచర్లు ఇందులో స్టాండర్డ్. ఇక కియా సోనెట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ వంటి అన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇంకా దీనికి క్రాష్ టెస్ట్ రేటింగ్ రాలేదు. కాబట్టి సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే వారు కళ్లు మూసుకుని నెక్సాన్ వైపు మొగ్గు చూపుతారు. ధర విషయానికొస్తే రెండూ దాదాపు రూ.7.30 లక్షల ప్రారంభ ధరతో పోటీగా ఉన్నాయి.