Skoda : బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..కేవలం రూ. 11 లక్షలకే సన్‌రూఫ్ కారు..స్కోడా కుషాక్ రికార్డు
బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..కేవలం రూ. 11 లక్షలకే సన్‌రూఫ్ కారు..స్కోడా కుషాక్ రికార్డు
Skoda : యూరోపియన్ కార్లంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. అందులోనూ స్కోడా బ్రాండ్ సేఫ్టీకి, పర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరు. తాజాగా స్కోడా ఇండియా 2026 కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. సాధారణంగా ఏ కారుకైనా టాప్ ఎండ్ వేరియంట్లలోనే అదిరిపోయే ఫీచర్లు ఉంటాయి. కానీ స్కోడా ఈసారి రూల్స్ మార్చేసింది. బేస్ వేరియంట్ కొనే కస్టమర్లకు కూడా సన్‌రూఫ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్కోడా ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్‌ను 2026 కోసం సరికొత్త హంగులతో ముస్తాబు చేసింది. ఈసారి వేరియంట్లలో కూడా మార్పులు చేస్తూ ఐదు రకాల ట్రిమ్ లైన్లను (క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మోంటే కార్లో) ప్రవేశపెట్టింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది క్లాసిక్ ప్లస్ అనే బేస్ వేరియంట్. సాధారణంగా కార్ కంపెనీలు బేస్ వేరియంట్లలో చాలా ఫీచర్లకు కోత విధిస్తాయి. కానీ స్కోడా మాత్రం కస్టమర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా, ఖరీదైన కార్లలో ఉండే ఫీచర్లను ఇందులో జోడించింది.
గేర్‌బాక్స్‌లో పెను మార్పు: కొత్త కుషాక్ బేస్ వేరియంట్ 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. గతంలో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తొలగించి, దాని స్థానంలో అడ్వాన్స్‌డ్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను స్కోడా పరిచయం చేసింది. ఇది కేవలం టాప్ వేరియంట్లకే పరిమితం కాకుండా బేస్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉండటం విశేషం. దీనివల్ల డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, మైలేజ్ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మాన్యువల్ కావాలనుకునే వారి కోసం 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ ఎలాగూ ఉంటుంది.
బేస్ వేరియంట్లోనే సన్‌రూఫ్: ఒకప్పుడు సన్‌రూఫ్ కావాలంటే కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ 2026 కుషాక్ క్లాసిక్ ప్లస్ వేరియంట్లోనే సింగిల్ ప్యానెల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఇచ్చి స్కోడా సంచలనం సృష్టించింది. దీనితో పాటు 16-అంగుళాల అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, 6.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక వైపు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు కూడా బేస్ మోడల్ నుండే లభించడం విశేషం.
సేఫ్టీలో తిరుగులేదు: సేఫ్టీ విషయంలో రాజీ పడని స్కోడా, కొత్త కుషాక్‌లో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. దాదాపు 25కు పైగా యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు, ఇండియన్ రోడ్లపై అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. టాప్ ఎండ్ మోంటే కార్లో వేరియంట్‌లో అయితే పనోరమిక్ సన్‌రూఫ్, 10.7 ఇంచ్ టచ్‌స్క్రీన్, మసాజ్ సీట్ల వంటి ఫీచర్లు అదనం. ఈ కారు ప్రారంభ ధర రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.