Mahindra : మహీంద్రా ఎస్‌యూవీలపై బంపర్ ఆఫర్..రూ.1.25 లక్షల దాకా భారీ డిస్కౌంట్

మహీంద్రా ఎస్‌యూవీలపై బంపర్ ఆఫర్..రూ.1.25 లక్షల దాకా భారీ డిస్కౌంట్

Update: 2026-01-26 04:50 GMT

Mahindra : భారతదేశ ఎస్‌యూవీ మార్కెట్‌లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, తన కస్టమర్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి చేరుకున్న మహీంద్రా, తన పాపులర్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, జనవరి 2026 మీకు అద్భుతమైన అవకాశం కానుంది. స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ 3XO వంటి పవర్ఫుల్ కార్లపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.

మహీంద్రా కార్లు అంటేనే వాటి గంభీరమైన లుక్, పవర్ఫుల్ ఇంజిన్, ప్రయాణికులకు ఇచ్చే గరిష్ట భద్రత. అందుకే భారతీయ రోడ్లపై మహీంద్రా ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ మరే ఇతర బ్రాండ్‌కు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుని మార్కెట్ లీడర్‌గా ఎదిగిన మహీంద్రా, 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఈ జనవరి నెలలో మూడు ప్రధాన మోడల్స్‌పై ఆకర్షణీయమైన నగదు తగ్గింపులు మరియు ఉచిత యాక్సెసరీలను కంపెనీ అందిస్తోంది.

ముందుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO విషయానికి వస్తే.. దీని AX7L TGDi వేరియంట్‌పై కస్టమర్లు రూ.80,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.60,000 నేరుగా నగదు తగ్గింపు ఉండగా, మరో రూ.20,000 విలువైన యాక్సెసరీలను కంపెనీ ఉచితంగా ఇస్తోంది. అత్యాధునిక ఫీచర్లు కోరుకునే యువతకు ఈ కారు ఇప్పుడు మరింత సరసమైన ధరలో అందుబాటులోకి వచ్చింది.

ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ తిరుగులేని ఆదరణ ఉన్న మహీంద్రా బొలెరో పై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. బొలెరోలోని N10, N10 ఆప్షనల్ వేరియంట్లపై మొత్తం రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.95,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 యాక్సెసరీస్ ప్యాకేజీ ఉన్నాయి. మొండితనానికి, మన్నికకు మారుపేరైన బొలెరోను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

చివరగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మహీంద్రా స్కార్పియో పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. స్కార్పియో క్లాసిక్ S వేరియంట్‌పై రూ.1.25 లక్షల తగ్గింపు లభిస్తుండగా, పాపులర్ మోడల్ స్కార్పియో-ఎన్ పెట్రోల్ వేరియంట్లపై (Z4, Z8, Z8L, Z8T) రూ.లక్ష వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకు లేదా పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీ ఊరు లేదా మీరు తీసుకునే డీలర్‌షిప్‌ను బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని మహీంద్రా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News