Volkswagen Tayron : ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించే కారు వచ్చేస్తోంది..సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్, హైటెక్ ఫీచర్లు
ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించే కారు వచ్చేస్తోంది
Volkswagen Tayron : ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లోకి తన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. టైరోన్ ఆర్-లైన్ పేరుతో వస్తున్న ఈ ప్రీమియం కారు ఉత్పత్తి మన దేశంలోనే ప్రారంభమైంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్‌లో ఈ కారును అసెంబ్లీ చేస్తున్నారు. మార్చి 2026లో ఇది అధికారికంగా రోడ్లపైకి రానుంది. ఈ కారు రాకతో 7-సీటర్ లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత వేడెక్కనుంది.
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన ఆర్-లైన్ సిరీస్‌ను మరింత విస్తరిస్తూ టైరోన్ ఆర్-లైన్ ఎస్‌యూవీని భారత్‌లో తయారు చేస్తోంది. ఇది చూడటానికి కంపెనీకి చెందిన ప్రసిద్ధ టిగువాన్ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, దానికంటే పెద్దదిగా, మరింత లగ్జరీగా ఉంటుంది. ముఖ్యంగా దీని వీల్‌బేస్‌ను 109 మిమీ పెంచారు, దీనివల్ల కారు లోపల మూడో వరుసలో కూర్చునే వారికి కూడా మంచి స్థలం లభిస్తుంది. 2,789 మిమీ వీల్‌బేస్‌తో వస్తున్న ఈ కారు, సుదీర్ఘ ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 204 హార్స్‌పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా కారులోని నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది. అంటే ఆఫ్-రోడింగ్ లవర్లకు కూడా ఈ కారు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. కేవలం పవర్ మాత్రమే కాదు, దీని డిజైన్ కూడా ఎంతో ప్రీమియంగా ఉంటుంది. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, స్పెషల్ లైటింగ్ ఎలిమెంట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.
కారు లోపలి ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 15 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్యాష్‌బోర్డ్, 30 రకాల కలర్లతో కూడిన యాంబియంట్ లైటింగ్ ఇందులో ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముందు సీట్లలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు దీనిని ఒక లగ్జరీ హోటల్ గదిలా మారుస్తాయి.
సేఫ్టీ పరంగా ఫోక్స్‌వ్యాగన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ టైరోన్ మోడల్ యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత్‌లో విడుదలయ్యే మోడల్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. మార్కెట్లో దీని ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది విడుదలైన తర్వాత టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.