Yamaha XSR155 : బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్.. యమహా XSR155 కొత్త వేరియంట్ ధర ఎంతో తెలుసా?
బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్.. యమహా XSR155 కొత్త వేరియంట్ ధర ఎంతో తెలుసా?
Yamaha XSR155 : టూవీలర్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్న ఇండియా యమహా మోటార్, కుర్రాళ్ల ఫేవరెట్ బైక్ XSR155లో సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎప్పటి నుంచో ఈ బైక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మేరకు మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను ఢిల్లీలో రూ.1,58,990గా నిర్ణయించింది. పాత మోడల్స్‌తో పోలిస్తే ఈ కొత్త బ్లాక్ వేరియంట్ మరింత ప్రీమియం లుక్‌తో, అదిరిపోయే ఫీచర్లతో దర్శనమిస్తోంది.
ఈ కొత్త కలర్ బైక్ క్లాసిక్ డిజైన్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. ముఖ్యంగా నల్లటి రంగు బాడీకి కాంబినేషన్‌గా వచ్చిన గోల్డెన్ కలర్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్ బైక్‌కు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. రెట్రో స్టైల్ నచ్చే వారికి, రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తిరిగి చూడాలనుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. దీని ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, సింపుల్ బాడీ స్ట్రక్చర్ పాతకాలపు బైక్‌లను గుర్తుకు తెస్తూనే, ఆధునిక టెక్నాలజీని కలబోసి రూపొందించారు.
ఫీచర్లు,స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. యమహా తన రైడర్-ఫస్ట్ ఆలోచనను ఇందులోనూ కొనసాగించింది. ఇందులో 155cc లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. యమహా పేటెంట్ కలిగిన VVA (వేరియేబుల్ వాల్వ్ యాక్చుయేషన్) టెక్నాలజీ వల్ల ఈ ఇంజిన్ 13.5 kW పవర్, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల బైక్ తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకోవడమే కాకుండా, లాంగ్ రైడ్స్‌లో కూడా మంచి పనితీరును కనబరుస్తుంది. తేలికపాటి ఛాసిస్, 17 అంగుళాల చక్రాల వల్ల ట్రాఫిక్‌లో కూడా బైక్ హ్యాండ్లింగ్ చాలా సులభంగా ఉంటుంది.
భద్రత విషయంలో యమహా ఎక్కడా రాజీ పడలేదు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. దీనివల్ల వర్షంలో లేదా ఇసుక రోడ్లపై బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల గేర్లు మార్చేటప్పుడు రైడర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగదు. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, వెనుకవైపు లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ హాజిమే ఆఓటా మాట్లాడుతూ.. "XSR155 మోడల్‌కు భారతీయ కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా మోడరన్ రెట్రో డిజైన్‌ను ఇక్కడి యువత బాగా ఇష్టపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ బ్లాక్ వేరియంట్‌ను సిద్ధం చేశాం. ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాదు, రైడర్ల అభిరుచికి మేము ఇచ్చే గౌరవం" అని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైడింగ్ అనుభూతిని రెట్టింపు చేసే మరిన్ని ఉత్పత్తులను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.