Tata Tiago EV : బడ్జెట్ ధరలో లగ్జరీ ఈవీ.. టియాగోలో ఫస్ట్ టైమ్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా
బడ్జెట్ ధరలో లగ్జరీ ఈవీ.. టియాగోలో ఫస్ట్ టైమ్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా
Tata Tiago EV : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన అత్యంత ప్రజాదరణ పొందిన అఫర్డబుల్ ఈవీ టాటా టియాగో ఈవీని సరికొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో లీకైన కొన్ని ఫోటోలు కార్ల ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుత మోడల్ కంటే ఇది చాలా ప్రీమియం లుక్‌తో, మోడ్రన్ ఫీచర్లతో రాబోతోందని అర్థమవుతోంది. కేవలం పైపైన మెరుగులు దిద్దడమే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా భారీ మార్పులు ఉంటాయని సమాచారం. టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేలా, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రేంజ్, లగ్జరీని అందించడమే లక్ష్యంగా టాటా ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది.
కొత్త టియాగో ఈవీ డిజైన్ విషయానికి వస్తే, దీని ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. సరికొత్త ఎల్‌ఈడీ లైటింగ్, స్లీక్ డే-టైమ్ రన్నింగ్ లైట్స్ కారుకు ఒక రాయల్ లుక్‌ను ఇస్తున్నాయి. కారు ముందు భాగం, బంపర్ మునుపటి కంటే చాలా మస్క్యులర్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, దీని సైడ్ మిర్రర్స్ కొంచెం పెద్దవిగా ఉన్నాయి. దీన్ని బట్టి ఇందులో 360-డిగ్రీ కెమెరా ఫీచర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అలాగే ఏరో-స్టైల్ అల్లాయ్ వీల్స్, కంపెనీ ఫిటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ చిన్న కారును ఒక లగ్జరీ ఎస్‌యూవీ స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి.
కారు లోపల కూడా ప్రయాణికులకు ఒక విలాసవంతమైన అనుభూతిని ఇచ్చేలా టాటా ప్లాన్ చేసింది. ఇంటీరియర్‌లో హై-క్వాలిటీ మెటీరియల్స్, కొత్త ఫినిషింగ్‌ను వాడుతున్నారు. టాటా కొత్త కార్లలో కనిపిస్తున్న ఆధునిక స్టీరింగ్ వీల్, భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండనున్నాయి. టెక్నాలజీని ఇష్టపడే వారి కోసం వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, అప్‌డేటెడ్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్ల కంటే టియాగో ఈవీని ముందంజలో ఉంచనున్నాయి.
టియాగో ఈవీ అంటేనే మైలేజీకి పెట్టింది పేరు. ప్రస్తుత మోడల్ 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తోంది. అయితే, రాబోయే కొత్త మోడల్‌లో పంచ్ ఈవీలో వాడుతున్న 30 kWh భారీ బ్యాటరీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే, ఈ కారు రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై 265 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సరికొత్త టియాగో ఈవీని టాటా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో లగ్జరీ కారు కావాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరం లాంటిదే అని చెప్పాలి.