Maruti eVitara : మారుతి ఈవీ మేనియా.. ఈ-విటారా కోసం రోజుకు 2,500 ఎంక్వైరీలతో రికార్డు
మారుతి ఈవీ మేనియా.. ఈ-విటారా కోసం రోజుకు 2,500 ఎంక్వైరీలతో రికార్డు
Maruti eVitara : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాతో ఈ సెగ్మెంట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మారుతికి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎంక్వైరీల వర్షం కురుస్తోంది. కంపెనీ సీనియర్ అధికారి పార్థో బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ 2,000 నుంచి 2,500 మంది ఈ కారు గురించి ఆరా తీస్తున్నారు. దీనిని బట్టి చూస్తే భారతీయులు మారుతి ఈవీల కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. జూలై నాటికి నెలకు 2,000 కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఈ-విటారా తయారీ జరుగుతోంది. అదే ప్లాంట్‌లో పాపులర్ మోడల్ ఫ్రాంక్స్ కూడా తయారవుతుండటంతో, ఉత్పత్తిని సమతుల్యం చేయడం మారుతికి ఒక సవాల్‌గా మారింది. అయితే, వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు మారుతి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి ఇదే ప్లాంట్‌లో ఒక ప్రత్యేక ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా ఏడాదికి ఏకంగా 2.5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సామర్థ్యం మారుతికి లభిస్తుంది. దీనివల్ల బుక్ చేసుకున్న కస్టమర్లకు కార్లు త్వరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
ధర విషయంలో మారుతి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. సాధారణంగా ఈ-విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.99 లక్షలుగా ఉంది. కానీ, బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ అనే సరికొత్త మోడల్‌ను మారుతి పరిచయం చేసింది. దీని కింద కారును కేవలం రూ.10.99 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ కోసం కిలోమీటరుకు సుమారు రూ.3.99 చొప్పున ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ఇది టాటా కర్వ్, ఎంజీ విండ్‌సర్, మహీంద్రా BE 6 వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీని ఇస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అందించడం ద్వారా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించాలని మారుతి భావిస్తోంది.
మారుతి చూపు కేవలం మెట్రో నగరాల మీదనే కాదు, చిన్న పట్టణాల (Tier-2, Tier-3) మీద కూడా ఉంది. దీని కోసం నెక్సా స్టూడియో పేరుతో 200 ప్రీమియం అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. రాబోయే ఐదేళ్లలో వీటిని 700 వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఈవీల్లో 10 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తుండటం విశేషం. ఛార్జింగ్ భయాన్ని పోగొట్టేందుకు 2030 నాటికి దేశవ్యాప్తంగా ఒక లక్ష ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని మారుతి సంకల్పించింది. మొత్తానికి ఎలక్ట్రిక్ యుగంలో కూడా మారుతి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధమైంది.