MG Starlight 560 : మహీంద్రా ఎక్స్‌యూవీకి చెక్..భారీ హంగులతో వచ్చేస్తున్న ఎంజీ స్టార్‌లైట్ 560
మహీంద్రా ఎక్స్‌యూవీకి చెక్..భారీ హంగులతో వచ్చేస్తున్న ఎంజీ స్టార్‌లైట్ 560
MG Starlight 560 : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్ తన దూకుడును పెంచింది. ఇటీవల మెజెస్టర్ ఎస్‌యూవీని పరిచయం చేసిన ఈ కంపెనీ, అది మార్కెట్లోకి రాకముందే మరో భారీ అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. అదే స్టార్‌లైట్ 560. ప్రస్తుతం ఈ సరికొత్త ఎస్‌యూవీ భారతీయ రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. ఇది నేరుగా మహీంద్రా XUV 7XO వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. 2027 నాటికి హైబ్రిడ్ మోడళ్లను కూడా తీసుకురావాలనే ఎంజీ వ్యూహంలో ఈ స్టార్‌లైట్ 560 అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
చూడటానికి స్టార్‌లైట్ 560 మిడ్-సైజ్ ఎస్‌యూవీల కంటే చాలా పెద్దదిగా, దాదాపు 4.5 నుంచి 4.8 మీటర్ల పొడవుతో భారీ రూపంలో కనిపిస్తోంది. టెస్టింగ్ సమయంలో కారు బాడీని కప్పి ఉంచినప్పటికీ, దాని రూపురేఖలు మాత్రం పవర్‌ఫుల్ అని అర్థమవుతున్నాయి. స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్, పైన సన్నటి ఎల్‌ఈడీ లైట్లు కారుకు మోడ్రన్ లుక్ ఇస్తున్నాయి. రోడ్డుపై వెళ్తుంటే అందరూ తిరిగి చూసేలా దీని స్టాన్స్ ఉంది. అంతేకాకుండా దీని పెద్ద అలాయ్ వీల్స్, వెనుక వైపు ఉన్న కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు కారును మరింత ప్రీమియం రేంజ్‌లో నిలబెడుతున్నాయి.
స్టార్‌లైట్ 560 అసలైన ప్లస్ పాయింట్ దాని లోపలి స్థలం. మహీంద్రా XUV 7XOతో పోలిస్తే, ఈ కారు వీల్‌బేస్ 60 మి.మీ ఎక్కువగా ఉండటం విశేషం. దీనివల్ల కారు లోపల లెగ్‌రూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది, తద్వారా సుదూర ప్రయాణాల్లో ప్రయాణీకులకు విలాసవంతమైన సౌకర్యం లభిస్తుంది. క్యాబిన్ లోపల 12.8 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి హై-టెక్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, విలాసవంతమైన సోఫాను రోడ్డుపై నడిపిన అనుభూతిని ఇస్తుంది.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్టార్‌లైట్ 560 రెండు రకాల పవర్‌ట్రెయిన్లలో లభించే అవకాశం ఉంది. ఒకటి ప్యూర్ ఎలక్ట్రిక్ కాగా, రెండోది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV). భారత్‌లో హైబ్రిడ్ కార్లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం, ఇది దాదాపు 197 BHP పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీ ట్రాఫిక్‌లో అయినా, హైవేల పైన అయినా ఇది పులిలా దూసుకుపోవడం ఖాయం. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో జత చేయనున్నారు.