Hyundai : హ్యుందాయ్ నుంచి మూడు కొత్త కార్లు .. మారుతి, టాటా మోటార్స్‌కు వణుకు మొదలైంది

హ్యుందాయ్ నుంచి మూడు కొత్త కార్లు .. మారుతి, టాటా మోటార్స్‌కు వణుకు మొదలైంది

Update: 2026-02-20 03:59 GMT

Hyundai : భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న మారుతి సుజుకి, టాటా మోటార్స్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు హ్యుందాయ్ భారీ స్కెచ్ వేసింది. 2026 సంవత్సరంలో మూడు సరికొత్త కార్లను లాంచ్ చేసేందుకు ఈ కొరియన్ దిగ్గజం సిద్ధమైంది. ఇందులో రెండు పాపులర్ మోడళ్ల అప్‌డేటెడ్ వెర్షన్లు ఉండగా, ఒకటి పూర్తిగా సరికొత్త కాంపాక్ట్ క్రాస్ఓవర్ కావడం విశేషం. ఈ కొత్త కార్ల రాకతో కాంపాక్ట్ ఎస్‌యూవీ, సెడాన్ సెగ్మెంట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

1. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్

హ్యుందాయ్ నుంచి రాబోతున్న మొదటి పెద్ద లాంచ్ ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్. టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తున్న ఈ మైక్రో ఎస్‌యూవీని సరికొత్త హంగులతో కంపెనీ తీర్చిదిద్దుతోంది. దీని ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, ఎక్స్టర్ సిగ్నేచర్ అయిన H-షేప్ డీఆర్ఎల్స్‌లో మార్పులు ఉండనున్నాయి. లోపలి భాగంలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సీట్ కవర్లతో ప్రీమియం లుక్ ఇవ్వనున్నారు. ఇంజిన్ పరంగా మార్పులు లేవు, అదే 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

2. హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

సెడాన్ కార్ల ప్రేమికులకు వెర్నా ఒక హాట్ ఫేవరెట్. ఇప్పుడు దీనిని మరింత లగ్జరీగా మార్చే పనిలో ఉంది హ్యుందాయ్. కొత్త వెర్నాలో డ్యూయల్-స్క్రీన్ సెటప్ (డిస్ప్లే, మ్యూజిక్ సిస్టమ్ కలిపి), కొత్త స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ ఉండబోతున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 160bhp పవర్ ఇచ్చే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

3. సరికొత్త హ్యుందాయ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్

హ్యుందాయ్ నుంచి వస్తున్న అత్యంత ఆసక్తికరమైన మోడల్ ఇది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ బేయన్ ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇది 4 మీటర్ల లోపు పొడవు ఉండి, కారు, ఎస్‌యూవీ కలయికలా (క్రాస్ఓవర్) కనిపిస్తుంది. ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది 2026 మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వెన్యూ కంటే స్టైలిష్‌గా, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు ఉండబోతోంది.

మొత్తానికి అదిరిపోయే డిజైన్లు, హైటెక్ ఫీచర్లతో హుందాయ్ వదులుతున్న ఈ మూడు బాణాలు మారుతి, టాటా మార్కెట్ షేర్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News