Hyundai : హ్యుందాయ్ ప్రైమ్ మ్యాజిక్.. ట్యాక్సీ మోడళ్లతో అమ్మకాల్లో సరికొత్త రికార్డు

హ్యుందాయ్ ప్రైమ్ మ్యాజిక్.. ట్యాక్సీ మోడళ్లతో అమ్మకాల్లో సరికొత్త రికార్డు

Update: 2026-02-15 04:42 GMT

Hyundai : ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తన పట్టును మరింత బిగించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన ప్రైమ్ సిరీస్ ట్యాక్సీ మోడళ్లు ఇప్పుడు కంపెనీ అమ్మకాల రాతను మార్చేశాయి. గ్రాండ్ i10 నియోస్, ఆరా మోడళ్లపై ఆధారపడి వచ్చిన ఈ ట్యాక్సీ కార్లు జనవరి 2026 నాటికి హ్యుందాయ్ సేల్స్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చాయి. ట్యాక్సీ ఆపరేటర్ల నుంచి వస్తున్న భారీ డిమాండ్‌తో హ్యుందాయ్ షోరూమ్‌లు కళకళలాడుతున్నాయి. హ్యుందాయ్ తన పాపులర్ కార్లయిన గ్రాండ్ i10 నియోస్‌ను ప్రైమ్ HB(హ్యాచ్‌బ్యాక్) పేరుతో, ఆరా సెడాన్‌ను ప్రైమ్ SD(సెడాన్) పేరుతో ట్యాక్సీ వేరియంట్లుగా లాంచ్ చేసింది. ఈ కొత్త స్ట్రాటజీ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. జనవరి 2026 విక్రయాల గణాంకాలను చూస్తే, ఈ రెండు మోడళ్ల అమ్మకాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే (డిసెంబర్ నుంచి జనవరికి) గ్రాండ్ i10 నియోస్ అమ్మకాలు 92.30% వృద్ధిని సాధించడం విశేషం.

హ్యుందాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. గ్రాండ్ i10 నియోస్ అమ్మకాలు జనవరి 2025లో 5,311 యూనిట్లు ఉండగా, 2026 జనవరి నాటికి అవి 7,710 యూనిట్లకు చేరాయి. అంటే ఏడాది కాలంలో 45.20% వృద్ధి నమోదైంది. ఇక ఆరా సెడాన్ విషయానికి వస్తే, గత ఏడాది 5,388 యూనిట్లు అమ్ముడవగా, ఇప్పుడు 7,978 యూనిట్లకు పెరిగింది. ట్యాక్సీ సెగ్మెంట్లోకి ఈ మోడళ్లు రావడం వల్లే ఈ అసాధారణమైన మార్పు సాధ్యమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అమ్మకాలు బాగానే ఉన్నా, ధరల విషయంలో మాత్రం హ్యుందాయ్ కస్టమర్లను కాస్త అయోమయానికి గురిచేస్తోంది. కంపెనీ మొదట ప్రైమ్ HB ధరను రూ.6 లక్షలుగా ప్రకటించింది. కానీ, అధికారిక బ్రోచర్‌లో మాత్రం రూ.6.40 లక్షలు అని ఉంది. దీనిపై హ్యుందాయ్ వివరణ ఇస్తూ.. రాష్ట్రాలను బట్టి ధరలు మారుతాయని స్పష్టం చేసింది.

రూ. 6 లక్షల ధర: ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తుంది.

రూ. 6.40 లక్షల ధర: దేశంలోని మిగిలిన మెజారిటీ రాష్ట్రాల్లో అమలవుతుంది.

మణిపూర్ ట్విస్ట్: ఇక్కడ ఇంఫాల్‌లో ధర రూ.6,42,500 కాగా, అదే రాష్ట్రంలోని మొయిరాంగ్‌లో మాత్రం రూ.6.40 లక్షలు ఉంది. ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు ధరలు ఉండటం చర్చనీయాంశంగా మారింది.

హ్యాచ్‌బ్యాక్ తరహాలో కాకుండా, ఆరా ఆధారిత ప్రైమ్ SD ధరల విషయంలో హ్యుందాయ్ స్పష్టతతో ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.90 లక్షలుగా నిర్ణయించారు. దీనివల్ల ట్యాక్సీ ఆపరేటర్లకు లెక్కలు వేసుకోవడం సులభతరమైంది. అయితే, ఇక్కడ కూడా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మాత్రం అదనంగా రూ.2,500 వసూలు చేస్తున్నారు.

ట్యాక్సీ డ్రైవర్లను ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను కూడా ప్రకటించింది. కేవలం రూ.31,950 డౌన్ పేమెంట్ కట్టి కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత ప్రతి నెలా రూ.11,870 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. తక్కువ పెట్టుబడితో సొంత కారు కొనుక్కోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది.

Tags:    

Similar News