Isuzu V-Cross : అసలుసిసలు అడ్వెంచర్ అంటే ఇదే మామ.. రూ.25.50 లక్షలకే ఇసుజు వి-క్రాస్ వచ్చేసింది

అసలుసిసలు అడ్వెంచర్ అంటే ఇదే మామ.. రూ.25.50 లక్షలకే ఇసుజు వి-క్రాస్ వచ్చేసింది

Update: 2026-02-23 04:40 GMT

Isuzu V-Cross : భారతదేశపు లైఫ్ స్టైల్ పిక్ అప్ ట్రక్ మార్కెట్‌లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఇసుజు వి-క్రాస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. కంపెనీ తన 2026 మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.25.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. పాత వెర్షన్‌తో పోలిస్తే ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, డిజైన్, ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చి అడ్వెంచర్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ కొత్త మోడల్‌లో ఇసుజు చేసిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. ఇకపై వి-క్రాస్‌లో 4x2 వెర్షన్ ఉండదు. కంపెనీ దీనిని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు మీరు ఏ వేరియంట్ కొన్నా సరే, అందులో 4-వీల్ డ్రైవ్ ఆటో-లాకింగ్ డిఫరెన్షియల్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. అంటే బేస్ మోడల్ కొన్నా సరే మీరు కొండల్లో, కోనల్లో, బురదలో కూడా అలవోకగా దూసుకుపోవచ్చు. దీన్ని ఒక పక్కా ఆఫ్-రోడ్ అడ్వెంచర్ వెహికల్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ఇసుజు ఈ నిర్ణయం తీసుకుంది.

2026 మోడల్ ఇసుజు వి-క్రాస్ డిజైన్‌లో మునుపటి కంటే మెరుగులు దిద్దారు. కొత్త బ్లాక్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ , 18-ఇంచ్ కొత్త అలాయ్ వీల్స్ దీనికి మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి. లోపలి భాగంలో టెక్నాలజీ పరంగా భారీ మార్పులే జరిగాయి. ఇప్పుడు ఇందులో 10.3-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360-డిగ్రీ కెమెరా, 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు చేర్చారు. అంటే ఈ ట్రక్ ఇప్పుడు కేవలం మొరటుగా మాత్రమే కాదు, చాలా స్మార్ట్‌గా కూడా మారిపోయింది.

పవర్ విషయానికి వస్తే, ఇందులో అదే పాత నమ్మకమైన 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 161 BHP పవర్, 360 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఆఫ్-రోడింగ్‌లో టైర్ ప్రెజర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇందులో కొత్తగా TPMS (టయర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) కూడా జోడించారు. సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు.

మీరు సాదాసీదా కార్లకు భిన్నంగా, స్టైలిష్‌గా ఉంటూనే కొండలు, వాగులు దాటగలిగే దమ్మున్న వెహికల్ కోరుకుంటున్నారా? అయితే కొత్త ఇసుజు వి-క్రాస్ మీకోసమే. రూ. 25 లక్షల పైబడిన బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ పికప్ ట్రక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. టయోటా హిలక్స్‌తో పోటీ పడుతున్న ఈ మోడల్, ఇప్పుడున్న ఫీచర్లతో ఆఫ్-రోడ్ ప్రియులకు ఫేవరెట్‌గా మారడం ఖాయం.

Tags:    

Similar News