Renault Duster : రూ. 21 వేలకే బుకింగ్.. డస్టర్ కొత్త కారు కొంటే ఏడేళ్ల వరకు నో టెన్షన్
రూ. 21 వేలకే బుకింగ్.. డస్టర్ కొత్త కారు కొంటే ఏడేళ్ల వరకు నో టెన్షన్
Renault Duster : మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తోంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సరికొత్త హంగులతో భారత్‌లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 17న కొత్త డస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు రెనో ఇండియా స్పష్టం చేసింది. 2022 డిసెంబర్‌లో భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించిన ఈ కారు, ఇప్పుడు నేరుగా గ్లోబల్ వెర్షన్ ఫీచర్లతో భారత్‌లో అడుగుపెడుతోంది. ఇప్పటికే రూ.21,000 అడ్వాన్స్ పేమెంట్‌తో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
డస్టర్ తిరిగి వస్తుందన్న వార్తతో వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. కంపెనీ ప్లాన్ ప్రకారం.. టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీ ఏప్రిల్ మధ్య నాటికి ప్రారంభం కానుంది. అయితే, పర్యావరణ హితంగా ఉండే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కోసం మాత్రం కస్టమర్లు కొంచెం వేచి చూడక తప్పదు. దీని డెలివరీలు 2026 దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారుపై రెనాల్ట్ ఏకంగా 7 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. భారత్‌లో ఒక కారుకు ఇంత సుదీర్ఘ కాలం వారంటీ ఇవ్వడం ఇదే మొదటిసారి అని కంపెనీ గర్వంగా చెబుతోంది.
డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ పాత మోడల్ లాగే బలంగా, మొరటుగా కనిపిస్తుంది. అయితే ఆధునికతను జోడిస్తూ కొత్త హెడ్‌ల్యాంప్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. కారు లోపలి భాగం అత్యంత విలాసవంతంగా ఉంది. 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ సపోర్ట్‌తో కూడిన 10 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం 17 రకాల అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కూడా చేర్చారు. 700 లీటర్ల బూట్ స్పేస్ ఉండటంతో లాంగ్ ట్రిప్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.