Grand Vitara vs Hyryder : ఒకే ఇంజన్..వేర్వేరు బ్రాండ్లు..మిడిల్ క్లాస్ వారికి ఏది బెస్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీ?

ఒకే ఇంజన్..వేర్వేరు బ్రాండ్లు..మిడిల్ క్లాస్ వారికి ఏది బెస్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీ?

Update: 2026-01-28 07:08 GMT

 Grand Vitara vs Hyryder : మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం అనేది ఒక ఎమోషన్. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో మైలేజీ ఎక్కువగా ఇచ్చే హైబ్రిడ్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రారాజులుగా వెలుగొందుతున్నాయి. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫారమ్ మీద తయారైనప్పటికీ, మధ్యతరగతి వారికి ఏది బెస్ట్? ఏ కారు కొంటే లాభం? అనే విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ గందరగోళాన్ని ఈ కథనంలో పోగొట్టుకుందాం.

మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్.. ఈ రెండూ జపాన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న అద్భుతాలు. నిజానికి ఈ రెండు కార్లను టయోటా ప్లాంట్‌లోనే తయారు చేస్తారు. అందుకే వీటి ఇంజన్, గేర్ బాక్స్, హైబ్రిడ్ సిస్టమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ బ్రాండ్ విలువ, సర్వీస్ సెంటర్లు, రీసేల్ వాల్యూ దగ్గరకు వచ్చేసరికి వీటి మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.

ధరలో ఎవరు తక్కువ?

బడ్జెట్ విషయంలో మారుతి గ్రాండ్ విటారా కొంచెం ముందుంటుంది. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అదే టయోటా హైరైడర్ బేస్ మోడల్ ధర రూ.10.95 లక్షల నుంచి ఉంటుంది. టాప్-ఎండ్ హైబ్రిడ్ మోడల్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా మారుతి కారే కొన్ని వేల రూపాయలు తక్కువగా ఉంటుంది. ఈ చిన్న వ్యత్యాసం సామాన్యులకు ఈఎంఐ రూపంలో కొంత ఊరటనిస్తుంది.

మైలేజీ అదుర్స్: ఈ రెండు కార్లలోని 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ సుమారు 92 bhp పవర్ ఇస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్ వల్ల ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని (ARAI ప్రకారం) ఇస్తాయి. అంటే ఒక చిన్న కారు ఇచ్చే మైలేజీని ఈ భారీ ఎస్‌యూవీలు అందిస్తున్నాయి. టౌన్లలో తిరిగేటప్పుడు కారు ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తుంది కాబట్టి పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గుతుంది. హైవే మీద వెళ్లేటప్పుడు పెట్రోల్ ఇంజన్ సాయం తీసుకుంటుంది.

ఫీచర్లు, కంఫర్ట్: రెండింటిలోనూ 9-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి కామన్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, గ్రాండ్ విటారాలో వెంటిలేటెడ్ సీట్లు (వేసవిలో చల్లదనం ఇచ్చేవి), రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు అదనంగా ఉంటాయి. మరోవైపు టయోటా హైరైడర్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కనిపిస్తాయి. లుక్స్ పరంగా చూస్తే గ్రాండ్ విటారా కొంచెం మస్కులర్‎గా కనిపిస్తే, హైరైడర్ చాలా క్లాసీగా, స్టైలిష్‌గా ఉంటుంది.

మీరు తక్కువ ధరలో కారు రావాలి, ఊరూరా సర్వీస్ సెంటర్లు ఉండాలి, రేపు అమ్మినప్పుడు మంచి ధర రావాలి అనుకుంటే మారుతి గ్రాండ్ విటారా బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా, మీకు టయోటా అనే బ్రాండ్ మీద నమ్మకం ఉండి, కారు వారంటీ ఎక్కువ కావాలనుకుంటే హైరైడర్ వైపు వెళ్లొచ్చు. మొత్తం మీద మధ్యతరగతి జేబుకు చిల్లు పడకుండా లగ్జరీ కావాలనుకుంటే ఈ రెండు కార్లు మార్కెట్‌లో తిరుగులేని ఆప్షన్లు.

Tags:    

Similar News