Renault Duster 2026: అదిరే లుక్.. అదిరిపోయే హైబ్రిడ్ టెక్నాలజీ..2026 రెనాల్ట్ డస్టర్ ఫీచర్లు ఇవే..!
అదిరే లుక్.. అదిరిపోయే హైబ్రిడ్ టెక్నాలజీ..2026 రెనాల్ట్ డస్టర్ ఫీచర్లు ఇవే
Renault Duster 2026 : ఇండియన్ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలోకి వచ్చేసింది. ఎంతో కాలంగా ఊరిస్తున్న 2026 మోడల్ డస్టర్ కోసం రెనాల్ట్ ఇండియా అధికారికంగా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, పవర్‌ఫుల్ టర్బో ఇంజన్, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ ఎస్‌యూవీ.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు. మీరు నేరుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీకు దగ్గరలోని రెనో డీలర్‌షిప్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్ పాత మోడల్ కంటే పూర్తి భిన్నంగా, మరింత కండలు తిరిగిన బాడీతో, లగ్జరీ ఇంటీరియర్స్‌తో వస్తోంది.
ధర, విడుదల తేదీ: రెనాల్ట్ డస్టర్ 2026 అధికారిక ధరలను మార్చి 2026 మధ్యలో ప్రకటించనున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఎస్‌యూవీ ధర రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే.. ప్రస్తుతం మార్కెట్‌ను ఏలుతున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ తప్పదు. బుకింగ్ చేసుకున్న వారికి వారి కారు ఎలా తయారవుతుందో చూసేందుకు రెనో ప్లాంట్‌ను సందర్శించే అరుదైన అవకాశం కూడా కంపెనీ కల్పిస్తోంది.
ఇంజన్, వేరియంట్లు: కొత్త డస్టర్ మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తోంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే, పర్యావరణ హితంగా ఉండేందుకు, మైలేజీ పెంచేందుకు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా జోడించారు. టర్బో పెట్రోల్ వేరియంట్లు మార్చి నెలలోనే మార్కెట్లోకి రానున్నాయి. అయితే, హైబ్రిడ్ వేరియంట్లు మాత్రం ఈ ఏడాది చివరలో.. అంటే దీపావళి 2026 నాటికి కస్టమర్ల చేతికి అందే అవకాశం ఉంది.
అప్‌డేటెడ్ ఫీచర్లు: 2026 డస్టర్ సరికొత్త CMF-B ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. దీని వల్ల కారు సేఫ్టీ, హ్యాండ్లింగ్ మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఆఫ్‌రోడింగ్ ఇష్టపడే వారి కోసం 4x4 ఆప్షన్‌ను కూడా రెనో కొనసాగించే అవకాశం ఉంది.