Mahindra: రికార్డు బ్రేక్ చేసిన మహీంద్రా.. జనవరిలో అమ్మకాల్లో జోరు
Mahindra: జనవరి 2026లో మహీంద్రా అండ్ మహీంద్రా 24% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఎస్‌యూవీ, వాణిజ్య వాహనాల్లో రికార్డు స్థాయి విక్రయాలు సాధించింది.
Mahindra: రికార్డు బ్రేక్ చేసిన మహీంద్రా.. జనవరిలో అమ్మకాల్లో జోరు
Mahindra: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) 2026 సంవత్సరాన్ని రికార్డు స్థాయి అమ్మకాలతో ఘనంగా ప్రారంభించింది. జనవరి 2026లో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 1,04,309 వాహనాలను విక్రయించినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 24 శాతం వృద్ధిగా నిలిచింది.
ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీ అమ్మకాలు 25 శాతం పెరిగి 63,510 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విభాగంలోనూ 22 శాతం వృద్ధి నమోదై 27,656 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎగుమతులు కూడా 5 శాతం పెరిగి 3,577 యూనిట్లుగా నమోదయ్యాయి.
జనవరి 14న విడుదల చేసిన XUV7XO, XEV 9S మోడళ్లకు మార్కెట్ నుంచి విశేష స్పందన లభించింది. కేవలం నాలుగు గంటల్లోనే రూ.20,500 కోట్ల విలువైన 93,689 బుకింగ్స్ నమోదు కావడం విశేషం.
మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట మాట్లాడుతూ, గతేడాది సాధించిన వేగాన్ని కొనసాగిస్తూ 2026ను బలంగా ప్రారంభించామని తెలిపారు. త్రీ వీలర్ విభాగంలో 28 శాతం వృద్ధితో 9,566 యూనిట్లు, లైట్ కమర్షియల్ వాహనాల విక్రయాల్లో 23 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించారు. ఈ గణాంకాలు ఎస్‌యూవీ ఆధారిత వ్యూహంపై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని కంపెనీ పేర్కొంది.