విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. తుని నుండి విశాఖ వెళ్తున్న లారీ నక్కపల్లి వద్దకు చేరుకోగానే వెనుక టైర్ ఊడిపోయింది. నీటి కోసం వెళ్తున్న మహిళకు ఆ టైర్ బలంగా తగలింది. దీంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లారీ టైర్ విడిపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. కుళాయి దగ్గర నీళ్ల కోసం వెళ్లి ఇలా మహిళ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.