కాకినాడలో పల్స్ పోలియో ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
కాకినాడ రామారావు పేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.
కాకినాడ: కాకినాడ రామారావు పేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చుక్కలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారులకు మంత్రి చుక్కలు వేశారు. ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రలో 54 లక్షల మందికి పైగా 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో అందుబాటులో 98,99,300 డోస్ లు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ రోజు నుండి 23వ తేదీ వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి.
ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు పిల్లలందరినీ పరిశీలించి, వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తే “P” గుర్తుతోనూ, ఏ చిన్నారైనా మిస్ అయితే “X” గుర్తు వేస్తారు. అన్ని ట్రాన్సిట్ పాయింట్లలో (బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్‌లు మొదలైనవి) ఈ రోజు నుండి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యటిస్తాయి. గుర్తించిన పలు ప్రాంతాలను (స్లమ్‌లు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు) కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్‌లు, పర్యాటక ప్రదేశాలలో 1140 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు.