మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జనవరి 23న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసన సభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్‌ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

Update: 2025-12-21 09:18 GMT

మంగళగిరి: జనవరి 23న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసన సభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్‌ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ్ నిఖిల్, నియోజకవర్గ కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకోని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. జనవరి 21 వరకు జరిగే ఈ పోటీలకు విశాలమైన మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వందలాది మంది కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు 21 సినిమాలు చేశాను. మంత్రి నారా లోకేష్ గారన్నా, క్రికెట్ అన్నా నాకు చాలా ఇష్టం. ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాలలో ఏపీ ముందుకు వెళుతోంది. 128 జట్లతో పోటీలను నిర్వహించడం గొప్ప విషయం’’ అన్నారు. మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నారా బ్రాహ్మణికి ‘బిజినెస్ టుడే మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు’ రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరూ కలిసి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన మంగళగిరి-మన లోకేష్ అంటూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మంత్రి నారా లోకేష్ ను తమ సొంత వ్యక్తిగా భావిస్తున్నారని చెప్పారు.

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ... నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ ఎంతో ఖర్చుతో కూడిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారని చెప్పారు. గతేడాది కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ నిర్వహించారన్నారు. మంత్రి నారా లోకేష్ క్రీడలను ప్రోత్సహించడం వలనే మంగళగిరి నుంచి కేపీ సాయి రాహుల్ ఆంధ్ర జట్టులో ఆడుతున్నారని, అలాగే పావని అనే మహిళ కూడా ఆంధ్ర జట్టులో ఆడుతున్నారని చెప్పారు. మంగళగిరి నుంచి ఇద్దరు ఆంధ్ర జట్టుకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి టోర్నమెంట్స్ అన్ని నియోజకవర్గాలలో జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు, నిర్వహకులను అభినందించారు.

ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు మంగళాద్రి డెవెలపర్స్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు మంచికలపూడి వైష్ణవి, తృతీయ బహుమతి కింద రూ.లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు.

ప్రతి మ్యాచ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు జవ్వాది కిరణ్ చందు, ప్రతి మ్యాచ్‌ టాస్ విన్నర్‌కు సిల్వర్ కాయిన్, ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్‌కు గోల్డ్ కాయిన్ రేవతి జ్యూయలరీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వల్లభనేని భార్గవ్, బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు ఎలక్ట్రికల్ బై సైకిల్ కాసరనేని జస్వంత్ ఇస్తారు. బౌలర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు బై సైకిల్ గుత్తా కిషోర్, ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలతో పాటు బైసైకిల్ తాడిబోయిన మహేష్, వికెట్ కీఫర్ ఆఫ్ ది సిరీస్ రూ. 25 వేలుతో పాటు బై సైకిల్ షేక్ ఇంతియాజ్‌లు అందించనున్నారు. మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు టీ షర్ట్స్, ట్రాక్స్ అందిస్తారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మండల, పట్టణ అధ్యక్షులు, కూటమి నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News