WPL 2026 : ఢిల్లీ వర్సెస్ బెంగళూరు.. 2024 ఫైనల్ రిపీట్.. రివెంజ్ తీర్చుకుంటారా?
ఢిల్లీ వర్సెస్ బెంగళూరు.. 2024 ఫైనల్ రిపీట్.. రివెంజ్ తీర్చుకుంటారా?
WPL 2026 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత నిలకడైన జట్టుగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, నాలుగో సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించింది. ఫిబ్రవరి 3న వడోదరలో జరిగిన ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా రెండు ఓటములతో డీలా పడ్డ ఢిల్లీ, ఆ తర్వాత పుంజుకుని ఏకంగా ఫైనల్ వరకు దూసుకెళ్లడం విశేషం. గత మూడు సీజన్లలో ఫైనల్‌కు వెళ్లినా రన్నరప్‌గా మిగిలిపోయిన ఢిల్లీ, ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ (62 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి జట్టును ఆదుకుంది. సోఫీ డివైన్, గార్డనర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైనా, జార్జియా వేర్‌హామ్ (35) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో షినెల్ హెన్రీ 3 వికెట్లతో చెలరేగగా, యువ బౌలర్ నందిని శర్మ రెండు కీలక వికెట్లు తీసింది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షెఫాలీ వర్మ, లిజెల్ లీ జోడి ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశారు. ఆ తర్వాత వేర్‌హామ్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కెప్టెన్ జెమిమా, లారా వోల్వార్డ్ కలిసి మరో వికెట్ పడకుండా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
ఇక ఫిబ్రవరి 5, గురువారం నాడు జరగబోయే మహా సంగ్రామంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన స్మృతి మంధాన సేన నేరుగా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఇది 2024 ఫైనల్ మ్యాచ్‌కు రీప్లే లాంటిది. అప్పుడు ఢిల్లీని ఓడించి బెంగళూరు టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు జెమిమా నేతృత్వంలోని ఢిల్లీ ఆ పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక ఆర్సీబీ రెండోసారి కప్పు కొడుతుందా? అనేది చూడాలి.