కామంతో కళ్లు మూసుకుపోయి.. తమ్ముడితో కలిసి భర్తను కిరాతకంగా చంపిన భార్య!

అతడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ, భార్య కన్ను మరో వ్యక్తిపై పడింది.

Update: 2026-01-24 05:26 GMT

అతడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ, భార్య కన్ను మరో వ్యక్తిపై పడింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన ఆమె, కనికరం లేకుండా సొంత తమ్ముడితో కలిసి పథకం వేసి భర్తను అంతమొందించింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిధిలో బుధవారం జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని డీఎస్పీ నాగరాజు శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఘటన వివరాలు:

దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు, సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. లాలు శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తూనే కొన్ని చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో గంజాయి విక్రయిస్తూ రెండు నెలల క్రితం పోలీసులకు దొరికి ఒంగోలు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.

అక్రమ సంబంధమే ప్రాణం తీసింది:

భర్త జైలులో ఉన్న సమయంలో ఝాన్సీకి, ఆమె తమ్ముడి స్నేహితుడైన కారు డ్రైవర్ సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఏర్పడింది. జైలులో ఉన్న శ్రీనును కలిసేందుకు వెళ్లినప్పుడు, తమ సంబంధం గురించి తెలిసి శ్రీను వారిని హెచ్చరించాడు. బయటకు వచ్చాక చంపేస్తానని బెదిరించడంతో, అతడు రాకముందే తామే అతడిని వదిలించుకోవాలని ఝాన్సీ నిర్ణయించుకుంది. ఇందుకోసం గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులకు రూ. 2 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

సినిమా ఫక్కీలో హత్య:

శ్రీను బెయిల్‌పై విడుదలైన క్రమంలో అతడిని చంపేందుకు నిందితులు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద పథకం ప్రకారం కారు ఆపారు. శ్రీను కిందకు దిగగానే సూర్యనారాయణ, అతని స్నేహితులు శ్రీను కళ్లలో కారం కొట్టారు. వెంటనే కారులో ఉన్న భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు కత్తులతో దాడి చేయడంతో లాలు శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

హత్య అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ అస్సాన్, ఎస్సై సాంబశివయ్య పాల్గొన్నారు.

Tags:    

Similar News