Vizag Gas Leak updates: భయం గుపిట్లో విశాఖ వాసులు.. విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి

Update: 2020-07-01 05:51 GMT

Vizag Gas Leak updates: విశాఖలో వరుస గ్యాస్ ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఎల్జీపాలిమర్స్ గ్యాస్ ఘటన ఎవరూ మర్చిపోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంపెనీని మూసివేశారు. నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు అధికారులు.

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువక ముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్ డౌన్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కంపెనీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు మంత్రి అవంతి శ్రీనివాస్ రావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై యాజమాన్యం, కార్మికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు.

ఈ ఘటనలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌. మరోవైపు ఇక్కడి ఫార్మా కంపెనీలతో తానం గ్రామస్తులు భయపడుతున్నారు. చాలా కంపెనీలు రూల్స్ పాటించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. తక్షణమే తానాం గ్రామాన్ని తరలించాని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు చాలా కంపెనీలు స్థానికులు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ ప్రమాదం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు సాయినార్ కంపెనీపై ఎఫ్ఆర్ఐ నమోదు చేశామని చెప్పారు సీపీ ఆర్ కే మీనా. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారని సీపీ తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News