అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానులు
-ఉద్యోగాల కల్పనలో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేష్ - మహిళల రక్షణకు దిశ చట్టం -ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పల్సస్ ఆదర్శం కావాలి
మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి దిశ చట్టం తీసుకొచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రజల మంచి కోరుతారని అందుకే ఆయన పట్టినరోజు పండగ రోజుగా మారిందని పేర్కొన్నారు. మహిళల రక్షణ- మహిళల భద్రత అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం విశాఖపట్నం పల్సస్ జంక్షన్‌లో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడారు.. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా మహిళల రక్షణ బాధ్యతగా, సమాజంలో అవగాహన పెంచేందుకు ఐటీ ఆధారిత సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
భద్రత, రక్షణపై అవగాహన లేకపోవడం వలనే పలు ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరగకూడదనే ఆలోచనతోనే దిశ చట్టం తీసుకొచ్చారని ఆయన అన్నారు. మహిళలపై దాడులు చేయాలనే ఆలోచన వస్తేనే భయపడేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారని, ఈ చట్టంలో నిందితులను 21 రోజుల్లో ఉరిశిక్ష అమలు జరిగేలా చట్టం సీఎం తీసుకొచ్చారని చెప్పారు. ఏపీలో దిశ చట్టం మహిళల భద్రతకు వరంగా మారిందన్నారు. మహిళా ఉద్యోగులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులుంటాయని సీఎం ప్రకటించడంతో అన్నిరంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. ఐటీహబ్‌గా, టూరిజం స్పాట్‌గా, వాణిజ్య రాజధానిగా పేరుకెక్కిన విశాఖను సీఎం అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రగతిపథంలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ కేంద్రంగా పల్సస్ సంస్థ 20 మంది ఉద్యోగులతో ఆరంభమై, 9 నెలల కాలంలో 600 మందికి ఉద్యోగాలకు కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. వీరిలో 450 మంది మహిళా ఉద్యోగులుండటం ..డాక్టర్ శ్రీనుబాబు మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎంతగా సహకరిస్తున్నారో అర్థం అవుతోందన్నారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారంతో దేశంలో అన్ని ప్రాంతాలకు పల్సస్ కార్యకలాపాలు విస్తరించి, వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన డాక్టర్ శ్రీనుబాబును యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయవంతమైన డాక్టర్ శ్రీనుబాబు ఆధ్వర్యంలో పల్సస్ కార్యకలాపాలు విస్తరించి ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పతరువుగా మారనున్నారని పేర్కొన్నారు. రానున్న ఏడాదికాలంలో మూడువేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న పల్సస్ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన ర్యాలీలో విశాఖ ఎంపీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.