MLC Anantha Babu Wife: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ట్విస్ట్: ఏ2గా ఎమ్మెల్సీ అనంత బాబు భార్య.. పోలీసుల గాలింపు!
MLC Anantha Babu Wife: మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది.
MLC Anantha Babu Wife: మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన సిట్ అధికారులు, ఆమెను రెండో నిందితురాలిగా (A2) అడిషనల్ ఛార్జిషీట్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
హత్య జరిగిన సమయంలో తాను బంధువులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లానని గతంలో లక్ష్మీ దుర్గ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, సిట్ అధికారులు సేకరించిన సాంకేతిక ఆధారాలు ఆమె వాదన తప్పని తేల్చాయి. 2022 మే 19వ తేదీ రాత్రి హత్య జరిగిన సమయంలో అనంత బాబుతో పాటు ఆమె కూడా కారులోనే ఉన్నట్లు సీసీ కెమెరా విజువల్స్ ద్వారా స్పష్టమైంది. దీంతో ఆమె పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
కోర్టులో ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు అడ్డతీగల, కాకినాడలోని నివాసాలకు వెళ్లగా ఆమె అక్కడ లేనట్లు గుర్తించారు. పరారీలో ఉన్న ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి బయటకు రాగా, ఇప్పుడు ఆయన భార్య కూడా నిందితురాలిగా చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.