Andhra Pradesh: ఇవాళ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్థంతి

Andhra Pradesh: ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం జగన్‌, షర్మిల

Update: 2021-09-02 01:40 GMT

నేడు వైస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఇవాళ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్థంతి కావడంతో.. తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఇడుపులపాయకు చేరుకున్నారు సీఎం జగన్, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. 11 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు.

ఇదిలా ఉంటే.. షర్మిల తన అన్న జగన్‌ కంటే ముందే వైఎస్సార్ ‌ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. జగన్‌కు ఏ మాత్రం కంటపడకుండా తన షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకున్నారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం హైదరాబాదులో విజయమ్మ నిర్వహించనున్న సంస్మరణ సభకు షర్మిల హాజరవుతారు.

దివంగత మాజీ సీఎం వైఎస్సార్‌ 12వ వర్థంతి కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన సతీమణీ విజయలక్ష్మి. ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం.. విజయమ్మ నేరుగా హైదరాబాద్‌ చేరుకుంటారు. నోవాటెల్‌లో నిర్వహించే వైఎస్ సంస్మరణ సభకు.. వైఎస్‌ఆర్‌తో అనుబంధమున్న ప్రముఖులను ఆహ్వానించారు విజయమ్మ. వైఎస్‌ఆర్ హయాంలో పనిచేసినటువంటి తెలుగు రాష్ట్రాల మంత్రులతో పాటు పలువురు ప్రముఖులకు ఆమె స్వయంగా ఫోన్‌ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారు. దాదాపు 300 మందిని ఆహ్వానించగా.. వారిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ సీనియర్లతో పాటు ప్రజాకవి గద్దర్ కూడా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీఎస్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్‌లకు, అలాగే.. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ఆహ్వానం చేరినట్లు తెలుస్తోంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కూడా ఆహ్వానం పంపారని.. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. ఇక వీరే కాక.. ప్రముఖ వైద్యులు, అడ్వకేట్లు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ జడ్జిలను విజయమ్మ ఆహ్వానించినట్లు సమాచారం. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న మాజీ మంత్రులను కూడా విజయమ్మ ఆహ్వానించారట. ఇక.. టాలీవుడ్ విషయానికొస్తే.. చిరంజీవి, నాగార్జున, కృష్ణ, నిర్మాత దిల్‌రాజులకు విజయమ్మ ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News