Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సకల ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు.
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సకల ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సర్వం సిద్ధం చేసింది. ఈసారి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పుణ్య దినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించాలని పరితపిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారు. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్త పారవశ్యంలో మునిగితేలుతారు. నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీనివాస గోవింద నామ స్మరణలతో కలియుగ వైకుంఠం మారుమోగుతూ ఉంటుంది.
డిసెంబర్ 30,31, జనవరి, ఒకటి తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ ఒకటి వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న భక్తులకు లక్కీడిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు కేటాయించారు. ఇందుకోసం సుమారు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... టీటీడీ రోజుకు 70 వేల మందికి స్వామి వారి సర్వ దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ మూడు రోజుల్లో టికెట్ పొందిన భక్తులకు మాత్రమే తిరుమలలో దర్శన భాగ్యం ఉంటుంది. జనవరి రెండు నుంచి 8వ తేదీ దరకూ వైకుంఠం క్యూకాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా భక్తులు సర్వదర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకొని తిరుమలలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. దేదీప్యమానంగా వేంకటేశ్వరుడు వెలుగొందేలా విద్యుత్ దీపాలంకరణ చేశారు. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా దేవాలయం ముందు దాతల సాయంతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఆలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేయనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ లడ్డూ ప్రసాదంతో పాటు రోజు భక్తులకు అందించే అన్న ప్రసాదం, ఉపాహారం వంటివి ఎక్కువ మందికి సరిపడేలా ముందస్తు చర్యలు చేపట్టారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా పది రోజుల పాటు ఆలయంలో సుప్రభాతం సహా ఆర్జిత సేవలు అన్నింటినీ రద్దు చేసినట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి జరిగే నిత్యకైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు.
తొలిసారి తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని ముందుగానే మంత్రుల కమిటీని నియమించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రితో పాటు హోం మంత్రి అనితతో ప్రభుత్వం కమిటీ నియమించింది. కొన్ని రోజులుగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తోంది.నిత్యం జిల్లా యంత్రాంగం, టీటీడీతో సమన్వయం చేసుకుంటూ జరుగుతున్న పనులపై చర్చిస్తోంది. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా దైవదర్శం కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తుతో పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. దర్శనాలకు పదిరోజులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారన్న అంచనాలతో భారీగా భద్రతను, బలగాలను పెంచారు. దేశ నలమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం తరలి వచ్చే భక్తులకు అసౌకర్యంతో పాటు ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి ఏఐ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ మూడు రోజులు టోకెన్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శభాగ్యం ఉంటుందని ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. టీటీడీ నియమ, నిబంధనలను అనుసరించి భక్తులు స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ బోర్డు స్పష్టం చేస్తోంది.
కొన్నేళ్లుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వ దర్శన టోకెన్లు జారీ చేసే వారు. టోకెన్లు పొందిన అనంతరం భక్తులను తిరుమల కు అనుమతించేవారు. భక్తులు ఏ రోజుకు ఆరోజు తిరుమల లో వారికి కేటాయించిన సమయంలో దర్శనం చేసుకునే వారు. గత ఏడాది జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తుల నుంచి ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అనంతరం తిరుపతిలో టోకెన్లు ఇచ్చే విధానాన్ని రద్దు చేసింది. ఈ ఏడాది కొత్తగా ఆన్ లైన్ లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీ డిప్ ద్వారా ఈ టోకెన్లు జారీ చేశారు. జనవరి రెండు నుంచి తిరుమల లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.