Nellore: విధి నిర్వహణకు వెళ్తుంటే విలన్‌లా మారిన డ్రైవర్.. టీచర్‌పై దాడి
Nellore: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోతున్నారు.
Nellore: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోతున్నారు. విధి నిర్వహణకు వెళ్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటన వివరాల్లోకి వెళితే.. బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో హరిత (35) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ఆమె గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఒక ఆటో ఎక్కారు. మార్గమధ్యంలో గూడూరు రూరల్ మండలం కందలి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి రాగానే డ్రైవర్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.
ఆటోను ఆపి, హరితను బెదిరించిన డ్రైవర్.. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచిన అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న హరితను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.
సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే టీచర్‌పై దాడి జరగడంతో తోటి ఉపాధ్యాయులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.