TDP: కొలికపూడికి పల్లా సీరియస్ వార్నింగ్.. క్రమశిక్షణ తప్పితే వేటే!
Palla Srinivasa Rao: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Palla Srinivasa Rao: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కొలికపూడికి పల్లా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
భేటీలోని కీలక అంశాలు:
"పార్టీ ఉంటేనే మీకైనా, నాకైనా గుర్తింపు ఉంటుంది. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా మీరు జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు" అని పల్లా స్పష్టం చేశారు. కొలికపూడి ఇటీవల తన వాట్సాప్ స్టేటస్‌లలో పెడుతున్న వివాదాస్పద పోస్టులపై పల్లా తీవ్రంగా నిలదీశారు. "అసలు ఆ పిచ్చి స్టేటస్‌లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారు? ఇలాంటి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోంది" అని మందలించారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తే, పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించడం కూడా మానేస్తుందని సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు పల్లా వివరించారు.
పల్లా శ్రీనివాస్ హెచ్చరికలపై కొలికపూడి స్పందిస్తూ.. తనది అనుభవరాహిత్యం వల్ల జరిగిన పొరపాటుగా వివరణ ఇచ్చారు. తదుపరి ప్రవర్తనలో మార్పు చేసుకుంటానని, సీనియర్ నేతలు తనకు తగిన మార్గనిర్దేశం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
గత కొద్దికాలంగా స్థానిక నేతలతో విభేదాలు, సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని చిన్ని అనుచరులను టార్గెట్ చేయడం వంటి అంశాల్లో కొలికపూడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పల్లా శ్రీనివాస్ నేరుగా రంగంలోకి దిగడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.