Tirumala Alert: జనవరి 24 నుండి 26 వరకు SSD టోకెన్లు రద్దు.. రథసప్తమి వేళ టీటీడీ కీలక నిర్ణయం!
తిరుమల రథసప్తమి సందర్భంగా జనవరి 24 నుండి 26 వరకు సర్వదర్శనం టోకెన్లు మరియు పలు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముఖ్య గమనికను జారీ చేసింది. జనవరి 25న నిర్వహించనున్న 'రథసప్తమి' పర్వదినం సందర్భంగా తిరుమలలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాల్లో పలు మార్పులు చేసారు.
మూడు రోజుల పాటు SSD టోకెన్లు రద్దు
రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను జనవరి 24 నుండి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రద్దైన దర్శనాలు మరియు సేవలు ఇవే:
రథసప్తమి రోజున (జనవరి 25) సూర్యప్రభ వాహనం నుండి రాత్రి చంద్రప్రభ వాహనం వరకు వరుసగా వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ క్రింది దర్శనాలను రద్దు చేశారు:
- అర్జిత సేవలు & ప్రత్యేక దర్శనాలు: ఆ రోజున జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.
- ప్రివిలేజ్ దర్శనాలు: ఎన్.ఆర్.ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శన సౌకర్యాలు ఉండవు.
- VIP బ్రేక్ దర్శనాలు: ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
- సిఫార్సు లేఖలు: జనవరి 24న విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
వాహన సేవల షెడ్యూల్ (జనవరి 25):
రథసప్తమి రోజున తెల్లవారుజామున 5:30 గంటల నుండి స్వామివారు ఏడు రకాల వాహనాలపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అధికారులకు కఠిన ఆదేశాలు
రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ట్రాఫిక్ & పార్కింగ్: ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భక్తుల రద్దీకి తగ్గట్టుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అన్నప్రసాదం & వైద్యం: వేచి ఉండే భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు నిరంతరం అందుబాటులో ఉంచాలని, అత్యవసర వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
భద్రత: సివిల్ పోలీసులు, విజిలెన్స్ విభాగం సమన్వయంతో భద్రతపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.