Andhra Pradesh Elections: ఆ రెండు సీట్లలో టీడీపీని కొట్టేవారే లేరు...
Andhra Pradesh Elections: కుప్పం, హిందూపురం...ఈ రెండు నియోజకవర్గాల గురించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా సైకిల్ పార్టీకి ఎదురే లేదు.
Andhra Pradesh Elections: ఆ రెండు సీట్లలో టీడీపీని కొట్టేవారే లేరు...
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్ని....కాంగ్రెస్, వైసీపీలు బద్దలు కొట్టలేదా? 40 ఏళ్లలో పసుపు జెండా తప్ప... మరో జెండా ఎగరలేదా? 1983 నుంచి టీడీపీ అభ్యర్థులే గెలుస్తున్నారా? ఎంత మంది అభ్యర్థులను మార్చినా...ఫలితం మాత్రం మారడం లేదా? ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ?
కుప్పం, హిందూపురం...ఈ రెండు నియోజకవర్గాల గురించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా సైకిల్ పార్టీకి ఎదురే లేదు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒకటో రెండో ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత...కనుమరుగైపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం నేటికి చెక్కు చెదరని నాయకత్వం, బలమైన కార్యకర్తలు, గ్రౌండ్ లెవల్ లో పార్టీ పటిష్టంగా ఉండటంతో టీడీపీకి వరుసగా విజయాలు లభిస్తున్నాయి. ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను మార్చినా...ప్రజల తీర్పులో మాత్రం మార్పు లేదు. నాలుగు దశాబ్దాలుగా ఒకటే తీర్పు. అదే తెలుగుదేశం పార్టీని గెలిపించడం. కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంతో మంది కీలక నేతలు పోటీ చేసినా...విజయం సాధించలేకపోయారు. క్యాస్ట్ ఈక్వేషన్లతో అభ్యర్థులను బరిలోకి దించినా...టీడీపీ అభ్యర్థులే గెలిచారు.
1983 నుంచి కుప్పంలో ఎదురులేని టీడీపీ
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కుప్పంలో ఆ పార్టీ జెండా పాతింది. 1983, 1985లో రంగస్వామి నాయుడు టిడిపి నుంచి గెలిచారు. 1989 నుంచి చంద్రబాబు ఇక్కడ్నుంచి గెలుస్తూనే ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారి పల్లె...చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు...28 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో టిడిపి నుంచి చంద్రబాబు నాయుడు మరోసారి చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో టిడిపి వరుస విజయాలు సాధించిన కుప్పంపై చంద్రబాబునాయుడు కన్ను పడింది. 1989 ఎన్నికల్లో ఆయన కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి చంద్రబాబు వెనుతిరిగాల్సిన పరిస్థితి రాలేదు. 1989 నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు. వరుసగా ఏడుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొంది రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎనిమిదో సారి బరిలోకి దిగారు.
టీడీపీకి కంచుకోట...హిందూపురం
హిందూపురం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోసినా...ఇక్కడ గెలుపు పక్కా. అభ్యర్థులను చూడరు...ఇక్కడ సింబల్‌ను మాత్రమే చూస్తారు. హిందూపురం నియోజకవర్గంలో నందమూరి ఫ్యామిలీని ఇక్కడ ప్రజలు వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు నందమూరి కుటుంబసభ్యులే... ఆరుసార్లు విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మొదలైన జైత్రయాత్ర...ఇప్పటి దాకా కొనసాగుతూనే ఉంది. 1983లో టీడీపీ తరపున పామిశెట్టి రంగనాయకులు గెలుపొందారు. 1985లో స్వయంగా ఎన్టీఆరే పోటీ చేయడంతో అఖండ విజయం అందించారు. ఆ తర్వాత 1989, 1994లో నందమూరి తారక రామారావు...వరుసగా గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలతో తన మార్కు చూపించారు అన్నగారు.
1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ, 1999లో సీసీ వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘని గెలుపొందారు. 2014లో తొలిసారి నందమూరి బాలకృష్ణ...ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019లోనే అక్కడి నుంచే గెలుపొందారు బాలయ్య. రాష్ట్రమంతటా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణనే ప్రజలు గెలిపించారు. హిందూపురంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగారు నందమూరి బాలయ్య.