రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు.. ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ లోకేశ్ ఫైర్
విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేరం రుజువైతే ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.
దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని చెప్పారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం జరగాలన్నదే తన అభిమతం అని చెప్పాడు. ఈ సంఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు వైఎస్ జగన్. ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు' అని ట్వీట్ చేశారు.
66 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి? అని లోకేష్ నిలదీశారు.