Simhachalam: ఇవాళ సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం

Simhachalam: 32 కి.మీ. సింహగిరి చుట్టూ భక్తుల ప్రదక్షిణ

Update: 2022-07-12 02:07 GMT

Simhachalam: ఇవాళ సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం

Simhachalam: అడుగులో అడుగేస్తూ..అప్పన్న స్వామిని స్మరిస్తూ అలసట మరచిపోతారు భక్తులు. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని కోర్కెను తీర్చాలని వేడుకుంటారు. రెండేళ్ల విరామం తర్వాత గిరి ప్రదక్షిణ ఉత్సవం సింహాచలంలో ఇవాళ జరుగనుంది.

సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కోవిడ్‌-19 కారణంగా రెండేళ్ల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువున దేవస్థానం బస్‌స్టాండ్‌ వద్ద పుష్పరథం ప్రారంభమవుతుంది. సింహాచలంలో తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు.

సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు భక్తులు కొండ దిగువన తొలి పావంచా నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. తొలి పావంచా స్వామి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణకు శ్రీకారం చుడతారు. తొలిపావంచా నుంచి పాత అడివివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షినగర్, అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడీ కూడలి, గోపాలపట్నం,ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్లమార్గం గుండా సింహగిరి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. పౌర్ణమినాడు స్వామి దర్శనంతో మహా పాదయాత్ర పరిసమాప్తమవుతుంది.

గిరిప్రదక్షిణకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం 32 కిలోమీటర్ల మార్గంలో 30 ప్రదే శాల్లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ ఆధ్వర్యంలో 10 చోట్ల మెడికల్ క్యాంపులు సిద్ధం చేశారు. 32 కిలోమీటర్లు మేర గతంలో కంటే మిన్నగా ఏర్పాట్లు చేసామని విశాఖ కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. గిరి ప్రదక్షిణకు 2016 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంత్ తెలిపారు.

13న వేకువ జామున 2 గంటలకు స్వామికి సుప్రభాత సేవ నిర్వహించి ప్రాత:కాల పూజలు చేస్తారు. సుగంధ పరిమళ చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. వేకువ జామున 3 గంటల నుంచి భక్తులను ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. రద్దీ ఉండనుండటంతో మూడు ప్రదక్షిణలు మాత్రమే చేయాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.

Tags:    

Similar News