Y S Sharmila: ఎన్నికల ప్రచారంలో షర్మిల దూకుడు..వివేకా హత్య ఉదంతాన్ని వివరిస్తున్న పీసీసీ చీఫ్..

Y S Sharmila: కడప జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న పర్యటన

Update: 2024-04-06 05:00 GMT

Y S Sharmila: ఎన్నికల ప్రచారంలో షర్మిల దూకుడు

Y S Sharmila: ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు తన పర్యటనను షర్మిల కొనసాగిస్తున్నారు.పెద్ద దర్గాను సందర్శించి అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం మూసాపేట కూడలిలో జరిగే మీటింగ్ లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి దేవుని కడడ బైపాస్ రోడ్డు, అశోక్ నగర్, అప్సర సర్కిల్, వై జంక్షన్లలో స్ట్రీట్ కార్నర్ లో మీటింగ్ ను నిర్వహించనున్నారు. కడప ప్రచారంలో ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు. ‘అమ్మా.. ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమంటూ షర్మిల ప్రజలతో అన్నారు. ఒక పక్క రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది. మరోవైపు ఆయన తమ్ముడు వివేకానందరెడ్డిని హతమార్చిన అవినాష్‌రెడ్డి ఉన్నారు. న్యాయం, ధర్మం వైపు మీరు నిలవండంటూ ఆమె ఓటర్లను అర్థించారు. అక్కడే ఉన్న వివేకా బిడ్డను డాక్టర్‌ సునీతను చూపుతూ.. ఈమె నాన్నను ఘోరంగా చంపారని ఆ హత్య చేసిన వారికే జగనన్న మళ్లీ టికెట్‌ ఇచ్చారని ఆమె ప్రజలతో అన్నారు. న్యాయం కోసం నిలబడిన రాజశేఖరరెడ్డి బిడ్డను గెలిపించమని అర్థిస్తున్నానంటూ.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఉద్వేగంగా మాట్లాడారు.

ఏపీ న్యాయయాత్ర పేరిట పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బస్సులో పర్యటిస్తూ తాను పోటీ చేస్తున్న కడప లోక్‌సభ పరిధిలో తొలిసారి నిన్న ప్రచారం ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గం అమగంపల్లి నుంచి సునీత తోడుగా షర్మిల ప్రచారం మొదలైంది. వారిద్దరూ మండుటెండల్లో ఊరూవాడా తిరుగుతూ ఓటర్ల మద్దతును అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో జనం సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ షర్మిల, వివేకా తనయ సునీతకు జేజేలు పలికారు. వారు కలిసి వస్తున్న సమాచారం తెలుసుకుని పనులన్నీ వదులుకొని గ్రామీణులు రోడ్లపైకి వచ్చి ఆప్యాయతను చాటారు. షర్మిల, సునీత సైతం ప్రజలతో మమేకమయ్యారు. వివేకా హత్య కేసు నిందితులను జగన్‌ కాపాడుతున్నారని వివరించేందుకు వారు ప్రతిచోటా ప్రయత్నించారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని రక్షిస్తానని.. పిలిస్తే పలుకుతానని.. సమస్యను భుజాన వేసుకుంటానని హామీ ఇచ్చారు. రాజన్న మాదిరి సేవ చేసుకునే భాగ్యం కల్పించండంటూ షర్మిల ఓటర్లను కోరారు. ‘జిల్లాకు జగన్‌ ఏ ఒక్క పనైనా చేశారా? రాజన్న హయాంలో చేపట్టిన పనులనూ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే.. జగన్‌ రూ.7 లక్షల కోట్లు చేశారని ప్రజలకు వివరించారు పీసీసీ చీఫ్ షర్మిల.

Tags:    

Similar News