Bhimavaram: సంక్రాంతి జోష్.. భీమవరంలో గది అద్దె రూ. లక్ష! కోడి పందేల కోసం కోట్లు కుమ్మరిస్తున్న పందెంగాళ్లు
Bhimavaram: భీమవరంలో సంక్రాంతి సంబరాలు.. ఆకాశాన్ని తాకుతున్న హోటల్ గదుల ధరలు! కేవలం మూడు రోజులకి లక్ష రూపాయల అద్దె వసూలు చేస్తున్న యజమానులు. కోడి పందేల జోరు, కోట్ల రూపాయల బెట్టింగ్‌ల పూర్తి వివరాలు.
Bhimavaram: సంక్రాంతి పండుగకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అప్పుడే పండుగ జోష్ పీక్స్‌కు చేరింది. కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ప్రాంతంలో వసతి గదుల ధరలు వింటే సామాన్యులకు గుండె గుభేల్ అంటోంది. పందేల సందడిని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం హోటల్ యజమానులు మూడు రోజులకు ఏకంగా లక్ష రూపాయల వరకు అద్దె డిమాండ్ చేస్తున్నారు.
ఖాళీ లేని హోటళ్లు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు: భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు పరిసరాల్లోని దాదాపు 150 హోటళ్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రముఖులు, వ్యాపారవేత్తలు తరలివస్తుండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
♦ సాధారణంగా రోజుకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ఉండే గది ధర ఇప్పుడు రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు చేరింది.
♦ భీమవరంలోని కొన్ని విలాసవంతమైన హోటళ్లలో మూడు రోజుల ప్యాకేజీ కోసం రూ. లక్ష వసూలు చేస్తుండటం గమనార్హం.
♦ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా ఉండటంతో గెస్ట్ హౌస్‌లు కూడా ముందే రిజర్వ్ అయిపోయాయి.
బరుల వద్ద కోట్ల రూపాయల పందేలు: ఈ ఏడాది కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల జోరు మరింత పెరగనుంది. ఇప్పటికే నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 2.5 కోట్లతో ఒక భారీ పందెం సిద్ధమైనట్లు సమాచారం.
♦ సీసలి, నారాయణపురం, చినఅమిరం ప్రాంతాల్లో రూ. కోటి పందేల కోసం సిండికేట్లు కాలుదువ్వుతున్నాయి.
♦ గత ఏడాది విజేతలను తమ బరులకు రప్పించేందుకు నిర్వాహకులు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. హోటళ్లు దొరకని వారు ప్రైవేట్ ఇళ్లు, కళ్యాణ మండపాలను కూడా అద్దెకు తీసుకుంటున్నారు.
మొత్తానికి, ఈ ఏడాది సంక్రాంతి పండుగ భీమవరంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన వేడుకగా మారబోతోంది.