గోదావరి జిల్లాలో సందడి చేస్తోన్న హరిదాసులు

West Godavari: సంక్రాంతి సంబరాల్లో హైటెక్ హరిదాసుల హడావుడి

Update: 2023-01-09 03:35 GMT

గోదావరి జిల్లాలో సందడి చేస్తోన్న హరిదాసులు

West Godavari: సంక్రాంతి అంటే సందడి. సందడి అంటే గోదావరి జిల్లాలు.. అలాంటి గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతికి హైటెక్ హంగులు చోటు చేసుకుంటున్నాయి. హరినామ కీర్తనలు ఆలపిస్తూ.. ఇంటింటికీ తిరిగే హరిదాసులు.. కాలానుగుణంగా బైకులపై వస్తూ అలరిస్తున్నారు. పెరుగుతున్న వయసు... వెంటాడుతున్న అనారోగ్య సమస్యల కారణంగా హరిదాసులు హైటెక్ హంగులతో ట్రెండీగా వస్తున్నారు... గోదావరి జిల్లాలో ఆకట్టుకుంటున్న ట్రెండీ హరిదాసుల హెచ్ఎంటీ ప్రత్యేక కథనం.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతీ ఏటా సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు సంక్రాంతి అతిథులుగా హరిదాసులు, గంగిరెద్దులు, డూడూ బసవన్నలు, మరోవైపు పిండి వంటలు, కోడిపందేలు ఇలా ఏ ఊరు చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తుంది. సాంప్రదాయ వేడుకల్లో మాత్రం మారుతున్న కాలానికనుగుణంగా హైటెక్ హంగులు చోటుచేసుకుంటున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే ముందుగా వచ్చే అతిథులు హరిదాసులు. ధనుర్మాసం నెలరోజులూ శ్రీ మహావిష్ణువులా అక్షయపాత్రను తలపై ధరించి, ఓ చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూరతో ఊరూరా తిరుగుతూ సాంప్రదాయాలను కాపాడుతూ వస్తూంటారు. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట ఏలూరు, చింతలపూడి మండల పరిసర ప్రాంతాల్లో ధనుర్మాసం నెలరోజులూ హరిదాసులు దర్శనమిస్తున్నారు. మిగిలిన పట్టణ ప్రాంతాల్లో రోజుకో గ్రామం వెళుతూ. హరిదాసులు తమ హరి నామస్మరణ చేస్తూ తమ పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

తరాలు మారడం, ఆదరణ తగ్గడంతో హరిదాసులు అంతకంతకూ తగ్గిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా అపార్టుమెంట్లు, భారీ భవంతుల్లోని ప్రజలు హరిదాసులు ఇంటిముంగిటకు వచ్చినా పట్టించుకోకపోవడంతో తమ సాంప్రదాయాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల్లో పదేళ్లలో దాదాపు 50 శాతం మంది హరిదాసులు తగ్గిపోయారు. ఇంకా అక్కడక్కడా ఉన్న వృద్ధ హరిదాసులు వారసత్వంగా వచ్చిన హరిదాసీ కళను బతికించుకునేందుకు, ప్రతీ గ్రామాన్ని సందర్శించేందుకు హైటెక్ బాట పట్టారు.

తలపై ఉంచే అక్షయపాత్రను మోటార్ బైక్ ఎక్కించి, చిడతలు, తంబూర శబ్ధాలను, హరినామ సంకీర్తనలను రికార్డు చేసి, ఓ మైకులో వినిపిస్తూ... ఊరూరా తిరుగుతూ హైటెక్ హరిదాసులుగా కనిపిస్తున్నారు. సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు కాలంలో హరిదాసులను చూడలేరు.

ప్రస్తుత హైటెక్ యుగంలో ఆదరణ లేక తాము ఇలా ప్రతీ గ్రామాన్ని నెలరోజుల్లో సందర్శించాలనే ఉద్దేశంతోనే మోపెడ్ ఎక్కాల్సి వచ్చిందంటున్నారు హైటెక్ హరిదాసులు. తమ పిల్లలకు హరినామ కీర్తనలను నేర్పలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల పాటు మాత్రమే హరిదాసులుగా కొనసాగే తమకు... మిగిలిన రోజుల్లో కూలీ పనులు చేసుకుని జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చాన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే సంస్కృతీ సాంప్రదాయాలు పరిరక్షించబడతాయని చెబుతున్నారు.. పాస్టర్లకు, పూజారులకు గౌరవ వేతనాలు ఇచ్చే విధంగానే తమకు కూడా ఆర్థిక సహకారం అందించాలని విన్నవిస్తున్నారు. 

Tags:    

Similar News