తాడేపల్లిలో ఉద్రిక్తత .. వలస కూలీలపై లాఠీచార్జీ

గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం వలస కూలీలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Update: 2020-05-16 06:05 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం వలస కూలీలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో కూలీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 1000 మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ.. వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గమనించి వివరాలు తెలుసుకున్నారు. వారి ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించి వివరాలు తెలుసుకొని స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.

సిఎస్ అదేశాలతో ఈరోజు ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేసిన తర్వాత సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో భయంతో పరుగులు తీశారు. వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.




Tags:    

Similar News