నేడు జగన్ ను కలవనున్న టీడీపీ నేత.. రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన టీడీపీ

Update: 2019-02-16 02:41 GMT

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీలో ప్రతిపక్షం వైసీపీ వలసలను ప్రోత్సాహిస్తోంది. అధికార టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రామపుల్లారెడ్డి శనివారం సాయంత్రం జగన్ ను కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి నచ్చక ఇదివరకే టీడీపీకి రాజీనామా చేశారు రామపులరెడ్డి. అయితే ఆయనను బుజ్జగించినా తన నిర్ణయంలో మార్పు ఉండదని ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి కెఇ కృష్ణమూర్తికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే పార్టీ నేతలు వరుసగా వైసీపీలో చేరుతుండటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. దీంతో సీరియస్ గానే దృష్టిసారించారు.

శుక్రవారం కొందరు టీడీపీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇంకా ఎంతమంది నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతారో కనుక్కుని.. వారిని బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలకు అప్పగించారు. అంతేకాదు వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు కౌంటర్ గా టీడీపీ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ అసంతృప్తి నేతలు అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి లను పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Similar News