Bank Holiday: ఈ నెల 16న బ్యాంకులకు సెలవు.. కారణం ఇదే.!

Bank Holiday: ఈ నెల 16న బ్యాంకులకు సెలవు.. కారణం ఇదే.!

Update: 2026-01-07 03:04 GMT

Bank Holiday: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుమ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితాలో జనవరి 16కు బ్యాంకు సెలవు లేదు. అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

బ్యాంకు ఉద్యోగుల అభ్యర్థన మేరకు జనవరి 16న సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, వాటి అనుబంధ కార్యాలయాలు కనుమ రోజున పనిచేయవు. దీంతో పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ బ్యాంకు సేవలు నిలిచిపోతాయి.

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఇప్పటికే జనవరి 14, 15 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండటంతో, వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాల అమలు కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మె కారణంగా ఆ రోజు కూడా బ్యాంకింగ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పండుగ సెలవులు, సమ్మెల నేపథ్యంలో ఈ నెలలో బ్యాంకింగ్ సేవలకు పలుమార్లు అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.

Tags:    

Similar News