ఆర్టీసీలో ఎవరినీ తొలగించడంలేదు: మంత్రి పేర్ని నాని
ఏపీఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తొలగించడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఏపీఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తొలగించడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. వారందరిని యథాతథంగా విధుల్లో కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వారందరిని తొలగిస్తున్నట్లు హఠాత్తుగా వార్తలు వచ్చాయి. దాంతో కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయాన్నీ ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. వారిని తొలగించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి.. మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఉద్యోగుల తొలగింపు అంశంపై పునఃసమీక్షించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.. మంత్రి పేర్ని నానికి నిన్న లేఖ కూడా రాసింది. దాంతో స్పందించిన మంత్రి పై విధంగా స్పందించారు.
ఇదిలావుంటే రాష్ట్రంలో రెగ్యులర్ ఆర్టీసీ బస్సుల సేవల పునః ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలూ రాలేదని.. కేంద్రం ఇచ్చే సడలింపులను బట్టి బస్సులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి. ఇక సడలింపు అనంతరం బస్సులు తిరగడం ప్రారంభమైతే సీట్లను తగ్గించి ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో శ్రామిక్ రైళ్లు ఏపీలో కూడా నడిపేందుకు కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.