Madanapalle Murder Case :ఆధ్యాత్మిక గురువును ప్రేమికుడిగా చెప్పుకున్న అలేఖ్య.. పెళ్లి వ్యవస్థపై ఏవగింపు

Update: 2021-01-28 13:48 GMT

మూఢనమ్మకం.. మూర్ఖపు పరిణామాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి. మదనపల్లె క్షుద్రపూజల వ్యవహారంలో వెలుగు లోకొస్తున్న వాస్తవాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.శివుడిని అమితంగా ఆరాధించే అలేఖ్య పుట్టుక, చావులు తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా విశ్వసించడం సంచలనం కలిగిస్తోంది. కరోనా కారణంగా.. నెలల తరబడి ఇంటికే పరిమితమైన అలేఖ్య లాక్‌డౌన్ సమయాన్ని కేవలం పుస్తక పఠనానికే కేటాయించింది. మహాభారతంతో పాటు చారిత్రక పుస్తకాలను చదివిన అలేఖ్యపై వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఆద్యాత్మిక వేత్తకు చెందిన కొటేషన్లను తరచూ పోస్టు చేసిన అలేఖ్య.. ఆయనను తన ప్రేమికుడిగా పేర్కొనడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆయన రాసిన పుస్తకాలను చదివిన అలేఖ్య.. వివాహ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయినట్లు సమాచారం. జుట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్‌ పిరమిడ్‌ అని, అది ఆమె అయస్కాంత శక్తిగా అభివర్ణించడం లాంటి పరిణామాలు అలేఖ్య మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.

ఈ నెల 15న అలేఖ్య పూర్తిగా నిరాశలో కూరిపోయినట్లు తెలుస్తోంది. నిరాశ అనే అఘాధంలో కూరుకు పోయాను అంటూ ఆమె పోస్టు చేసింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయానన్న అలేఖ్య.. ఇలాంటి సమయంలో తనలో కొత్త ఆలోచనలు ఉదయించాయని.. వాటిని తాను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నానని రాసుకొచ్చింది. ఈ మొత్తం పోస్టులతో అలేఖ్య మానసిక పరిస్థితులే కాకుండా ఆమె ముందుగానే పునర్జన్మ ఆలోచలనను ఆచరణలో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విద్యావంతులైన అలేఖ్య తల్లిదండ్రులను ఎలా ఒప్పించింది అనే ప్రశ్న మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.






Tags:    

Similar News