Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో వర్షాలు..?
Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో వర్షాలు..?
Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇది తుఫానుగా మారుతుందా? లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఈ వ్యవస్థ కదలికలపై వాతావరణ శాఖ నిరంతరం గమనిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రస్తుతం సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశముండటంతో తీర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఆధారపడి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థ మరింత బలపడితే తుఫానుగా మారే పరిస్థితి ఉందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ నుంచి వచ్చే తాజా అప్‌డేట్స్‌ను ప్రజలు గమనిస్తూ ఉండాలని సూచించారు.