వైసీపీకి జర్క్ ఇచ్చేందుకే సుజనాతో.. కరణం భేటీ అయ్యారా!

Update: 2019-10-26 01:55 GMT

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ఆయన భేటీ కావడం చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఆయనతో ఉన్న పరిచయంతోనే సమావేశమయ్యానని అంటున్నారు కరణం బలరాం. బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇటీవలే సుజనా చౌదరి చెప్పారు. ఇదే సమయంలోనే ఆయన టీడీపీ నేతలతో భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంటే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ను వైసీపీలోకి పంపిస్తారని నేతలు అనుకుంటున్నారు. వెంకటేష్ ను వైసీపీలోకి పంపి తాను టీడీపీలోనే కొనసాగాలని కరణం అనుకుంటున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కుమారుడి రాజకీయ భవిశ్యత్ పై దృష్టిసారించిన కరణం.. ఇటీవల వైసీపీ నేతలతో రహస్యంగా సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి లతో పలుమార్లు కరణం బలరాం భేటీ అయ్యారు. దాంతో ఆయన వైసీపీలో చేరతారని భావించారు. ఈ క్రమంలో సడన్ గా సుజనాతో భేటీ అవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తన కుమారుడిని వైసీపీలోకి పంపి ఏదో ఒక మండలం నుంచి జడ్పీటీసీ గా పోటీ చేయించి.. జడ్పీ ఛైర్మెన్ ను చేయాలనీ కరణం భావిస్తున్నారట.. ఇందులో భాగంగానే వైసీపీతో చర్చలు జరుపుతున్నారట.. అయితే వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వైసీపీకి జర్క్ ఇచ్చేందుకే సుజనాను కలిసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది తేలాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Tags:    

Similar News