జలానందంలో మునిగితేలుతున్న రాయలసీమ రైతులు

Update: 2019-09-18 05:50 GMT

రాయలసీమలో మూడు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. 63 మండలాల పరిధిలో ఒక్క రోజులోనే 25 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భారీ వర్షాలతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. నంద్యాల పట్టణంతోపాటు గ్రామాలను, పంట పొలాలను, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది. కడప జిల్లాలో కుందూ, పెన్నా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానంది కోనేరులు సైతం నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో ఉధృతి పెరిగి.. సోమశిల డ్యామ్‌కు భారీగా వరద వచ్చి చేరుకుంది. సోమశిల ప్రస్తుత నీటిమట్టం 41.94టీఎంసీలకు చేరుకుంది. దీంతో చాలా ఏళ్లుగా నీళ్ల కోసం నిరీక్షించిన రైతులు ఆనందంలో మునిగిపోయారు. అయితే నదీ పరివాహక ప్రాంతాలను వరద చుట్టు ముట్టడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు జనం. మరోవైపు ప్రొద్దుటూరు వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

Tags:    

Similar News