బోరు నుంచి గ్యాస్..వ్యాపించిన మంటలు..ప్రజల బెంబేలు!
ఏపీలో గ్యాస్ పేరు చెబితేనే చాలు... గుండెలు దడదడలాడుతున్నాయి.
ఏపీలో గ్యాస్ పేరు చెబితేనే చాలు... గుండెలు దడదడలాడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకయి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిందే.. 13 మంది మరణించగా, వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. దీని ప్రభావానికి లోనైన ఐదు గ్రామాలలలో ఇంకా దానికి సంబంధించిన ఛాయలు పోలేదని స్థానికులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ఇంటి వద్ద వేసుకున్న బోరు నుంచి అనుకోకుండా గ్యాస్ వచ్చి మంటలు రేగడంతో మరోమారు పాలిమర్స్ ను గుర్తుకు తెచ్చింది.
బోరు బావి నుంచి నీరు రావాలి కానీ అక్కడ గ్యాస్ వస్తోంది. అంతే కాదు ఆ గ్యాస్ నిరంతరాయంగా వస్తుండటంతో మంటలు కూడా చిమ్ముతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో వరుస గ్యాస్ లీకేజీలు కలకలం రేపుతున్నాయి. నిన్న రాత్రి కోనపోతుగుంట గ్రామంలో చేతి పంపు నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. గ్రామానికి చెందిన యేసుబాబు ఏడేళ్ల క్రితం ఇంటి పెరట్లో మంచినీటి కోసం బోరు వేయించాడు. ఐదేళ్ల నుంచి నీరు రాకపోవడంతో అలాగే వదిలేశాడు. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి బోరులో నీరు తన్నుకు రావడం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి 10 గంటల సమయంలో బోరుకు చేతి పంపు ఏర్పాటు చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అర గంట పాటు ప్రయత్నించి మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత చేతి పంపును తొలగించారు.
అయితే బోరుకు వేసిన చేతి పంపును తొలగించినా బోరు నుంచి నీరు బయటకు వస్తూనే ఉంది. గ్యాస్ వాసన రావడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో ఓఎన్‌జీసీ (ONGC) అధికారులకు సమాచారం అందించారు రెవెన్యూ అధికారులు. పాలకొల్లు సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే స్థానికులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఇలాంటి సందర్భాల్లో అధిక స్థాయిలో ఆస్థి నష్టం, జన నష్టం జరిగిన ఘటనలున్నాయి. ఈ బోరు వల్ల అటువంటి ప్రమాదమేదైనా ముంచుకొస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.