తంబళ్లపల్లి టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
తంబళ్లపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గాల మధ్య పోరు ప్రస్తుత ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డిపై శంకర్ వర్గీయుల అసంతృప్తి శంకర్ యాదవ్‌కే ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని వినతి పార్టీ కష్టకాలంలోనూ కేడర్‌కు అండగా శంకర్ యాదవ్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి వర్గానికే గుర్తింపు లభిస్తోందని ఆవేదన
తంబళ్లపల్లి టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
రాయలసీమలోని ఆ నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు శంకర్ యాదవ్ వర్గానికి, ప్రస్తుత ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఒకప్పుడు నియోజకవర్గలో పార్టీకి గట్టి పునాది వేసిన శంకర్ యాదవ్‌ను పక్కన పెట్టడం పట్ల కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసలేం జరుగుతోంది..?
వైసీపీ హయాంలో పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడిన శంకర్
చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో కీలకపాత్ర
కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన శంకర్ యాదవ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం.. రాజకీయంగా ఎప్పుడూ వేడి రగిలిస్తునే ఉంటుంది. ఇక్కడ టీడీపీకి ఒకప్పుడు తిరుగులేని పునాది వేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్.. 2014 ఎన్నికల్లో విజయం సాధించి.. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీని ఒక కంచుకోటలా నిలబెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో.. పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడిన నాయకుడిగా ఆయనకు పేరుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. లాంటి కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. లోకేష్ యువగళం పాదయాత్రను రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఎనిమిది రోజులపాటు నిర్వహించి, పార్టీ అధిష్టానం మన్ననలు పొందారు. కష్టకాలంలో కార్యకర్తలకు ఆర్థికంగా అండగా నిలబడి, వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు శంకర్
యాదవ్.
2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయింపు
శంకర్ యాదవ్ వర్గీయుల్లో అసంతృప్తి
అయినా జయచంద్రారెడ్డి గెలుపు కోసం పని చేసిన శంకర్ వర్గం
కూటమి ప్రభుత్వంలోనూ న్యాయం జరగడం లేదన్న ఆవేదన
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారికే గుర్తింపు లభిస్తోందన్న భావన
అయితే, 2024 ఎన్నికల్లో కంబళ్లపల్లి టీడీపీ టికెట్ అనూహ్యంగా జయచంద్రారెడ్డికి కేటాయించడంపై శంకర్ యాదవ్ వర్గీయుల్లో అప్పుడే అసంతృప్తి మొదలైంది. అయినప్పటికీ, పార్టీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేశారు. కానీ, ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఓటమిపాలవ్వడం, ఆ తర్వాత ఆయన వ్యవహారశైలిపై పార్టీలో ఇప్పుడు కొత్త చిచ్చు రేగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తంబళ్లపల్లిలో టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డి వైసీపీ వారికి సానుకూలంగా ఉన్నారని.. కూటమి ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో.. సీనియర్ నాయకులను కలుపుకుని పోవడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, గతంలో వైసీపీలో ఉండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరిన వారికి కాంట్రాక్టు పనులు కట్టబెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
లోకేష్ బర్త్ డే సందర్భంగా బ్యానర్ల ధ్వంసంపై స్పందించని జయచంద్రారెడ్డి?
గాయపడిన టీడీపీ నాయకులకు శంకర్ యాదవ్ పరామర్శ
టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని శంకర్ యాదవ్ సూచన
జయంద్రారెడ్డి వర్గాన్ని ఉద్దేశించే శంకర్ యాదవ్ వ్యాఖ్యలంటూ చర్చ
శంకర్ యాదవ్‌కే బాధ్యతలు ఇవ్వాలని కార్యకర్తల వినతి
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను ధ్వంసం చేయడం, పార్టీలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నా జయచంద్రారెడ్డి స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంతర్గత పోరుకు నిదర్శనంగా మారింది. ఈ గొడవల్లో గాయపడిన టీడీపీ నాయకులు నటరాజ్ నాయక్, సాగర్ కుమార్‌లను శంకర్ యాదవ్ స్వయంగా పరామర్శించడం.. తంబళ్లపల్లిలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. శంకర్ యాదవ్ ఈ వ్యాఖ్యలు నేరుగా జయచంద్రారెడ్డి వర్గాన్ని ఉద్దేశించి చేసినవేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. శంకర్ యాదవ్ పరామర్శ పట్ల పార్టీ కార్యకర్తల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీకి, కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుడికే నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను మార్చనున్న టీడీపీ
ఈ మార్పుల్లో తంబళ్లపల్లి కూడా ఉందని ప్రచారం
శంకర్ యాదవ్‌కు చంద్రబాబు, లోకేష్, పల్లా సత్సంబంధాలు
అంతర్గత పోరుపై టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ
ప్రస్తుతం రాష్ట్రంలో 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చే యోచనలో టీడీపీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పుల్లో తంబళ్లపల్లి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. శంకర్ యాదవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వంటి ప్రముఖులతో మంచి సంబంధాలు ఉండటంతో, మళ్లీ తంబళ్లపల్లి బాధ్యతలను ఆయనకే అప్పగిస్తారన్న ఆశాభావం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తంబళ్లపల్లిలో మళ్లీ శంకర్ యాదవ్ వైభవం మొదలవుతుందా? లేదా ప్రస్తుత పరిస్థితులే కొనసాగుతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ అంతర్గత పోరుపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.