Srikakulam: డేకురు కొండ మహత్యం.. సంక్రాంతికి వేలాదిగా తరలివస్తున్న భక్తజనం
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని డేకురు కొండ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. నీలకంఠేశ్వర స్వామి దర్శనం, కొండపై నుంచి జారితే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో సంక్రాంతి రోజున ఆంధ్రా–ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు యాత్రకు తరలివస్తున్నారు.
Srikakulam: డేకురు కొండ మహత్యం.. సంక్రాంతికి వేలాదిగా తరలివస్తున్న భక్తజనం
Srikakulam: మీరు సంతానం కోసం తపించిపోతున్నారా.... అయితే తప్పకుండా ఈ కొండపైకి రండి... ఎక్కడం మాట ఎలా ఉన్నా దిగేటప్పుడు మాత్రం డేకరాలి అదేనండి... చిన్నప్పుడు జారుడు బల్ల మీద నుండి జారారే అలా... జారితే మీకు తప్పక సంతానం కలుగుతుంది. ఈ ఆధునిక యుగంలో మీరు నమ్మలేక పోతున్నారా... నిజమండీ బాబు. ఆ కొండ పేరే జారుడు కొండ స్థానిక భాషలో డేకురుకొండ అంటారు. దీని కోసం తెలుసుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోని పలాస దగ్గరకు వెళ్ళాల్సిందే...
ఇదిగో మీరు చూస్తుంది... డేకురు కొండ ఇదే... డేకరడము అంటే ఏమిటో అనుకునేరు ఇక్కడ యాసలో అలా అంటారు.. కాని జారుడు అని అర్ధం అటువంటి కొండ శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం ఉదయపురంలో ఉంది. పలాసా అంటే టక్కున గుర్తోచ్చేది తెల్లబంగారంగా పేరొందిన జీడిపప్పు. రాష్ట్రంలో మేలిమి జీడిపప్పుకి ఇదే కేరాఫ్ అడ్రస్.
పలాసకు అతి చేరువలో సుమారు 3ఎకరాల విస్తీర్ణంలో డేకురు కొండ ఉంది. ఇక్కడే మరో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ కొండపై నీలకంఠేశ్వర స్వామి ఆలయం.. దానికి ఆనుకుని మరికొన్ని చిన్నచిన్న ఆలయాలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం సంక్రాంతి వచ్చిందంటే సందడి సందడిగా మారుతుంది. కొత్తఅలుళ్లు... పెళ్లికూతుళ్లతో సంక్రాంతి పండుగ రోజున ఇక్కడ ప్రత్యేకంగా యాత్ర జరుగుతుంది. భోగి పండుగ సాయంత్రం నుంచి సంక్రాంతి అర్ధరాత్రి వరకూ యాత్ర జరుగుతుంది. కనుమ రోజున మాత్రం ఎవ్వరూ ఈ జారుడుకొండపై నుంచి జారరు అది ఇక్కడ నిషిద్దం.
డేకురు కొండ వద్దకు పిల్లలతో, కొత్త పెళ్లి కూతుళ్లు వచ్చి మూడు సార్లు జారుతారు. ఈ ప్రాంతంలో పాండవులు వనవాస సమయంలో సేదదీరినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న మహేంద్రగిరులపై ఉన్నట్లుగా ఇక్కడ కూడా భీముడు పాదముద్రతో పాటు గోపాదం లాంటి చిహ్నాలు దర్శనమిస్తాయి. దీంతో ఈ డేకురుకొండకి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నట్లుగా ఆ ప్రాంతవాసులు పేర్కోంటున్నారు. అలాగే ఈ కొండ దిగువ బాగాన ఓ బిలం ఉంటుంది.. అక్కడ నుంచి డైరెక్ట్‌గా కాశీ వరకూ వెళ్లవచ్చని పెద్దలు చెబుతున్నారు.
ఈ కొండపై నీలకంఠేశ్వరుడిని సంక్రాంతి రోజు దర్శనం చేసుకుంటే కోరిన కొర్కెలు తీరుతాయని ప్రజలు మొక్కులు తీర్చుకుంటారు. వివాహం కాని వారు సంతానం లేని వారు కొండపై నుండి డేకురుతారు. అందుకే దీనిని డేకురు కొండ అని అంటారు. ఇక్కడ ఒడిషా, ఆంధ్రా సంప్రదాయాలలో పూజలు నిర్వహిస్తారు. అలాగే ఈ స్థలంలో పాండవులు నడియాడిన గుర్తులు కూడా ఉన్నాయని అర్చకులు రాఘవ పండా తెలిపారు.
ఒక్క సిక్కోలు జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒడిషా నుంచి వచ్చే వారు కూడా కొండపై నుంచి డేకురుతూ మొక్కులు మొక్కుతుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ కొండ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని తమలపాకులు వ్యాపారం చేసుకునే గోపి, చిలకమ్మ అనే దంపతుల ఆశయం మేరకు.. ఆలయం అభివృద్ది చెందిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలను తర్లాకోట జమిందారుల వంశానికి చెందిన వారు ప్రారంభిస్తుంటారు. శోభారాణి అనే మహిళ తన కొడుకుకి ఉద్యోగం వస్తే మరలా వస్తానని మొక్కుకున్నానని. అందుకే మళ్లీ వచ్చారని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజున ఇక్కడ ఘనంగా యాత్ర జరుగుతుందని ఉదయపురం చెందిన పండిత రాంబాబు అన్నారు. స్వామి దర్శనం కోసం వేలాది మంది వస్తారని తెలియజేశారు.
డేకురు కొండపై నుంచి జారడం వలన వజ్జకుమార్ అనే వ్యక్తికి పీహెచ్‌డి, వివాహం, సంతానం వంటి కోర్కేలు తీరాయని తెలిపాడు. టెక్కలికి చెందిన రవి శ్రీనివాస్ 10 సంవత్సరాల కిత్రం వచ్చి ఉద్యోగం రావాలని కోరుకోగా.. కోరిక నెరవేరిందని అప్పటి నుంచి ప్రతిసారి వస్తున్నాని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ తమకున్న సమస్యలు ఈ విధంగా నేరవేరుతున్నాయని బలంగా నమ్ముతున్నారు.
ఈ నమ్మకం నిజం అవుతుందా లేదా అన్నది పక్కన ఉంచితే. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాలకు, వ్యవహారాలకు ఈ జిల్లా పట్టుకొమ్మగా ఉందనడంలో అతిశయోక్తి లేదు... ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి రోజున ఇక్కడ జరిగే యాత్రమాత్రం నిజం.