ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం: ప్రభుత్వ డాక్టర్లు 'ప్రయివేటు' వైద్యం ఇక కుదరదు!

ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ.. ప్రయివేట్ వైద్యం కోసం ఆసుపత్రులు నిర్వహించడం ఇకపై కుదరదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుజాతారావు కమిటీ సిఫారసుల మేరకు పలు నిర్ణయాలను ఈ దిశలో ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2019-09-19 04:15 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్‌ ప్రాక్టీసు నడపడాన్ని బ్యాన్ చేసింది. ఇకనుంచి వారు అలా పనిచేయకుండా ఉండేందుకు వారి వేతనాలను పెంచనున్నారు. దశాబ్దాలుగా ప్రైవేట్‌ ప్రాక్టీసుపై విమర్శలు వెల్లువెత్తినా ఏ ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేటు ప్రాక్టీసులు నడిపే వారిపై సస్పెన్షన్ విధించింది. అయితే ఆ తరువాత మళ్ళీ వారు విధుల్లో చేరుతున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వైద్యులు ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రులలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలాకాని పక్షంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ప్రాక్టీసు నడుపుకోవచ్చు..

వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా బుధవారం ఈ కమిటీ రిపోర్టును సమర్పించింది. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి ఆరోగ్య శాఖా సమీక్షా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి.. వారికి జీతాలు పెంచాల్సిందిగా సుజాతారావు కమిటీ సూచించిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్‌ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News