పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు సీఎం ప్రశంసలు

సచివాలయంలో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ని, మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.

Update: 2025-12-17 06:44 GMT

అమరావతి: సచివాలయంలో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ని, మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. నిన్న పోలీస్ కానిస్టేబుళ్ల నియామక పత్రాలు అందజేసే సందర్భంలో ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగితే, ఉప ముఖ్యమంత్రి వెంటనే రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. ‘‘ ఉప ముఖ్యమంత్రి ఆ ఊరి రోడ్డు సమాచారం అందిస్తే, తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా, పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారు.’’ అని మెచ్చుకున్నారు. అలాగే, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని ప్రశంసించారు. ప్రతీ శాఖ ఆన్ లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి సేవలు అందించాలని చెప్పారు. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయని, వాటిని తిరిగి ప్రవేశపెట్టాని చెప్పారు.

జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదని చెప్పారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధామని పిలుపు ఇచ్చారు. మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయని తెలిపారు. నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయని తెలిపారు.

ఈ సదస్సులో సీఎస్ విజయానంద్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News