నమ్మకమే నిలబెట్టింది..

నమ్మకమే నిలబెట్టింది.. నమ్మకమే నిలబెట్టింది.. నమ్మకమే నిలబెట్టింది..

Update: 2019-09-20 04:32 GMT

భూమన కరుణాకర్ రెడ్డి.. రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ కుటుంబంతో భూమనకు ముప్పైఏళ్ళ అనుబంధం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో మూడుతరాల వారితో పనిచేసిన రికార్డ్ ఆయనకే దక్కుతుంది. వైఎస్ రాజారెడ్డికి జైల్లో పరిచయమైన భూమన అప్పటినుంచి వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉన్నారు. ఆ నమ్మకమే భూమనను రాజకీయ అందలం ఎక్కించింది. వైఎస్ఆర్ సీఎం కాకముందునుంచి కూడా ఆయనకు రాజకీయ సలహాదారుగా మారిపోయారు.

అప్పట్లో వైఎస్ తలపెట్టిన పాదయాత్రను భూమన దగ్గరుండి పర్యవేక్షించారు. వైఎస్ తో మాట్లాడలేని నేతలెందరో భూమానతో పంచుకునేవారు. భూమన సేవలను గుర్తించిన వైఎస్ మొదటగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా నియమించారు.. ఆ సమయంలో టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. భూమన హయాంలోనే టీటీడీలో అనేక గొప్ప కార్యక్రమాలు జరిగాయి. శ్రీవేంకటేశ్వర కల్యాణోత్సవాలు, దళిత గోవిందం వంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు శ్రీవారి భక్తి ఛానల్ అయిన ఎస్వీబీసీని కూడా ఆయనే ప్రారంభించారు.

తాళ్లపాక అన్నమాచార్యుని 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత భూమనకే దక్కింది. 2009 లో వైఎస్.. తిరుపతి అసెంబ్లీ సీటు ఇచ్చినా.. నటుడు చిరంజీవి చేతిలో ఓటమిపాలయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు భూమన. జగన్ కూడా ఆయనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎంతంటే జగన్ వెళ్లే ప్రతి శుభకార్యానికి భూమన వెంట ఉండాల్సిందే అనేంతగా. జగన్ కు రాజకీయంగా సలహాలు సూచనలు అందిస్తున్నారు. పార్టీ క్లిష్ట సమయాల్లో కూడా వెనకవుండి నడిపించారు. వైసీపీ అత్యున్నత కమిటీలో పనిచేసిన భూమన.. ఉత్తరాంధ్ర పార్టీ పర్యవేక్షకుడిగా కూడా ఉన్నారు.

2012 ఉపఎన్నికలో.. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. అయితే వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందని అందరూ భావించారు.. కానీ అమాత్య యోగం లభించలేదు. అయితే కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న భూమనను ప్రస్తుతం ఏదో ఒక కీలక పదవిలో నియమించాలన్న ఉద్దేశ్యంతో జగన్.. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆయనతోపాటు మరో ఆరుగురికి అవకాశం కల్పించినా.. భూమన స్థానం వేరు.. నిజాయితీ, నిబద్ధతలే మళ్ళీ ఆయనను శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాయి. ఈ సందర్బంగా ఈ పదవి తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 

Tags:    

Similar News