పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని అమలు చేసిన సీఎం జగన్
పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని అమలు చేసిన సీఎం జగన్
విశాఖ జిల్లా ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ తవ్వకాల విషయంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఉన్న 3,030 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేసారు. ఈ రేకు సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. 'సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం' అని సీఎంపేర్కొన్నారు. కాగా 2015 నవంబరు 5న విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రిల్లా అటవీ ప్రాంతంలో 3,030 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నంబరు 97 జారీచేసింది గత ప్రభుత్వం. దీనిని తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి.
పాదయాత్ర సమయంలో జగన్ బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు రద్దు చేస్తామన్నారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఏజెన్సీ బాక్సైట్ ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. ఇక్కడున్న విలువైన ఖనిజం దేశంలో మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌టన్నులు, గూడెంలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. అయితే వీటి తవ్వకం వలన జలాశయాలు దెబ్బతిని మైదాన ప్రాంతంలోని నదుల్లోని నీటి ప్రవాహం తగ్గిపోతుంది. అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.